* ఆర్ ఎస్ఎస్ చెప్పినట్లే ఆ పార్టీ నడుచుకుంటోంది
* రిజర్వేషన్లు కావాలా, వద్దా ప్రజలు తేల్చుకోవాలి
* ప్రభుత్వ సంస్థల అమ్మకానికి కుట్ర
* డబుల్ ఇంజిన్ అంటే అంబానీ, అదానీ
* 10 ఏళ్లలో మోదీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు
* పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం
* బీజేపీపై ప్రజా చార్జ్ షీట్ విడుదల చేసిన కాంగ్రెస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడమే భారతీయ జనతా పార్టీ విధానమని, ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా రిజర్వేషన్ల రద్దుకు దారి తీసినట్టేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 2025కు వందేళ్లు అవుతుందని, ఆ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ప్రతిపాదనను అమలు చేసేందుకు బీజేపీ సిద్దం అవుతోందని వెల్లడించారు. రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో ప్రతిపాదించారని తెలిపారు. ఈ మేరకు ‘‘పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం’’ పేరుతో కాంగ్రెస్ హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో బీజేపీపై ప్రజా చార్జ్ షీట్ విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయండి.. రిజర్వేషన్లు రద్దు.. వద్దు అనుకుంటే బీజేపీకి ఓటేయండి.. అని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల రద్దునా-రిజర్వేషన్ల కావాలినా అనే రిఫరెండంపై ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ కు పట్టం కడితే రిజర్వేషన్లు పెంచే బాధ్యత తమ ప్రభుత్వానిది అని, తెలంగాణలో 14 సీట్లను కాంగ్రెస్ కు ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 70 నుంచి 75 శాతానికి పెంచుకుంటూ పోతామని తెలిపారు.
పెన్సిలు, ఎరేజర్ పై కూడీ జీఎస్టీ
అధికారంలోకి వస్తే ఒక్కో జన్‌ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పైగా జీఎస్టీ పేరుతో దోచుకుంటోందని అన్నారు. పిల్లల పెన్సిలు, ఎరేజర్ పై కూడా జీఎస్టీ వేస్తున్నారని, అగ్గిపెట్టె, అగరుబత్తిని కూడా వదలలేదని అన్నారు.
ప్రభుత్వ సంస్థల అమ్మకం
పదేళ్లలో ప్రభుత్వ సంస్థల అమ్మకానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఎల్ ఐసీ సహా ప్రతి సంస్థనూ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని సీఎ రేవంత్ విమర్శించారు. డబుల్ ఇంజిన్ అంటే అంబానీ, అదానీ అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతోందని అన్నారు. పదేళ్లలో 113 లక్షల కోట్ల అప్పును మోదీ చేశారని వివరించారు.
ఉద్యోగాల పేరుతో మోసం
యువతను ఉద్యోగాల పేరుతో మోదీ సర్కారు మోసం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మతతత్వ విధానాలు అవలంబిస్తోందన్నారు. బడా వ్యాపారులకు దేశ సంపదను పంచి పెడుతున్నారని ఆరోపించారు.
———————————————-