ప్రజా పాలనే కలెక్టర్ల పనితీరుకు కొలమానం…
99 రోజుల ప్రగతి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం!!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లక్ష్యాలను, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని, మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈ మూడు నెలల కాలం కలెక్టర్ల పనితీరుకు అసలైన పరీక్ష అని, వారి సర్వీస్ కెరీర్‌కు ఇది పునాదిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.
వారధిగా కలెక్టర్లు – క్షేత్రస్థాయి పర్యటనలు:
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జిల్లా కలెక్టర్లు వారధిగా పని చేయాలని సీఎం సూచించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు అధికారులే. కలెక్టర్లు ఏసీ గదులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజా సమస్యలు అర్థమవుతాయి. నెలలో కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మమేకం కావాలి” అని ఆదేశించారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆషామాషీగా ఐఏఎస్ కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్థకత చేకూరుతుందని హితవు పలికారు. కలెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేసి నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. జూన్ నెలలో వీరి పనితీరుపై మరోసారి సమీక్షా సమావేశం ఉంటుందని వెల్లడించారు.
ప్రజా ప్రతినిధులతో సమన్వయం – శిక్షణ:
మార్చి 6 నుంచి ప్రారంభమయ్యే ఈ 99 రోజుల ప్రణాళికను విజయవంతం చేసేందుకు గ్రామ సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు పాలనపై అవగాహన కల్పించేందుకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా నియమించి, 10 వారాల పాటు సాగే ప్రత్యేక కార్యాచరణను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన:
గ్రామ మరియు వార్డు సభల్లో ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన పథకాలపై స్పష్టత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల జారీ, సన్న బియ్యం సరఫరా. ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (గృహజ్యోతి). రైతు రుణమాఫీ, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం. ₹500 కే గ్యాస్ సిలిండర్ వంటి లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేయాలి. ప్రతి పథకం లబ్ధిదారుల ముఖ గుర్తింపు (Face Recognition) ప్రక్రియను చేపట్టి, కేవలం అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చూడాలని, అనర్హులు లబ్ధి పొందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యా, వైద్య రంగాలపై ప్రత్యేక నిఘా!!
రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ఒక అధికారిని బాధ్యుడిగా చేయాలని, కలెక్టర్లు కూడా వారానికి ఒకసారి పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం తొలి రోజైన జూన్ 12 నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించి, రోగులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు.
అక్రమాలపై ఉక్కుపాదం – భూసేకరణ..
రాష్ట్ర ఆదాయానికి గండికొట్టే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని తిరిగి రాబట్టాలని, ఔట్సోర్సింగ్ నియామకాల్లో జరిగే అక్రమాలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలని సూచించారు. భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’ అమలులో జిల్లా కలెక్టర్లు పూర్తి భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కోరారు.
