* కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టాకే మాట్లాడండి..
* బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రేవంత్ రెడ్డి, హరీష్ రావుల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు, భూ లావాదేవీలపై తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై సీఎం రేవంత్‌రెడ్ది తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడిన కేసీఆర్, హరీశ్ రావును జైలులో పెట్టిన తర్వాతే మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు. కేసీఆర్, హరీశ్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై దర్యాప్తును ముందుకు సాగనివ్వడం లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావు ఇసుక మాఫియాతో రూ.వేల కోట్లకు అధిపతులుగా మారారని అన్నారు. హరీశ్ రావు మామ, తమ్ముడు, బావమరిది పేరుపై భూ బదలాయింపు చేయనందుకే పొంగులేటిపై కక్షకట్టారని అన్నారు. భూ దోపిడీపై హౌజ్ కమిటీకి సిద్ధమా అని సవాల్ విసిరారు.
* బీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు
ఉపముఖ్యమంత్రి విక్రమార్క ఫైర్..
బీఆర్ఎస్ నేతలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. నాయకులను బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని విమర్శించిన ఆయన పదేళ్లు హౌస్ కమిటీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నాని ప్రశ్నించారు. నిన్నటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను పదే పదే అడ్డుకుంటున్నారని, వారు జరగాలనుకున్నట్టు సభ జరగదని స్పష్టం చేశారు. ‘వృద్ధ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే బిల్లుపై మాట్లాడమంటే అల్లరి చేస్తున్నాని మండిపడ్డారు. స్పీకర్‌కు నోటీస్ ఇవ్వకుండా మంత్రి పేరు తీయడమే తప్పు.. సీబీ సీఐడీకి ఇచ్చిన తర్వాత కూడా అల్లరి ఎందుకు.. చప్పట్లు కొట్టుకుంటూ సభను అంగడిలా మార్చకండి.. అని హితవు పలికారు. గతంలో వేసిన హౌస్ కమిటీలతో ఏం సాధించారు.. పదేళ్లలో మీరు వేసిన హౌస్ కమిటీల రిపోర్ట్ సభలో పెట్టారా?. బీజేపీ సలహా మేరకు కాళేశ్వరం విచారణ సీబీఐకి అప్పగిస్తే ఏం జరిగిందని ప్రశ్నించిన భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ నేతలు సభను జరగనివ్వొద్దన్న ఎజెండాతో వచ్చారని ధ్వజమెత్తారు. ధరణి పేరిట నాడు వందల ఎకరాల భూములను తమ వారి పేర్లపై బదలాయించుకున్నారని, వాటిపై హౌస్ కమిటీ వేయాలన్నారు.
* పొంగులేటిని తొలగించాల్సిందే: కేటీఆర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ స్కామ్ బయటపడిందని, ఈ అక్రమం వాస్తవమేనని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు.. అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఆ అవినీతిలో వాటా ఉన్నందునే ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి 2020 నుంచి 2022 వరకు పొంగులేటి చైర్మన్‌గా ఉన్నారని, సీఎం మాత్రం ఆ కంపెనీ పొంగులేటి దూరపు బంధువులదని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం అవినీతికి పాల్పడిన మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మంత్రి కుటుంబాన్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. మైనింగ్ పేరిట రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కోకాపేట్‌లోని భాగ్యలక్ష్మి మైనింగ్ ముఖ్యమంత్రి బంధువులదని అన్నారు. వేల కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేసుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 280 ఎకరాలను తమ ప్రభుత్వం ఎల్ అండ్ టీ కంపెనీకి లీజుకు ఇచ్చిందని, ఆ భూమిని కూడా కొట్టేయడానికి దండుపాల్యం బ్యాచ్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎల్ అండ్ టీ సీఎఫ్ఓను జైలులో వేస్తామని బెదిరించారని అన్నారు. ఇది పెద్ద కుంభకోణమని, ప్రభుత్వం వినకపోతే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. మంత్రి పొంగులేటిని పదవి నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు.
