* ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రాణాలు కాపాడొచ్చు
ఆకేరు న్యూస్, హనుమకొండ :
ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారిపోయాయి. జంక్ ఫుడ్, ఫ్రైడ్, ఓవర్ ఆయిలీ ఫుడ్ వినియోగం పెరిగింది. దీనికి తోడు శారీరక శ్రమ తగ్గిపోయింది. ఫలితంగా గుండెపోటు మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఒకప్పుడు వయసు 50, 60 ప్లస్‌లో గుండెపోటు కనిపించేందు. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా హార్ట్ ఎటాక్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా వరంగల్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జి. మల్లికార్జున రావు *గుండెపోటు సందర్భంగా కనిపించే లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి *ఆకేరు న్యూస్*కు వివరించారు. అవి ఆయన మాటల్లోనే..
* గుండెపోటు లక్షణాలు:
– గుండె పోటు వచ్చే ముందు ప్రధానంగా ఛాతిలో నొప్పి, ఎడమ చేయి లాగడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
– విపరీతమైన అలసట, కళ్లు తిరగడం, ఛాతిలో అసౌకర్యం లేదా ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
– ఛాతి, దాని కిందిభాగంలో ఉబ్బరంగా ఉంటే గ్యాస్ అనుకుని పట్టించుకోకుండా ఉండొద్దు.
* ప్రాణాలను కాపాడే 3 మాత్రలు
గుండెపోటు లక్షణాలు కనిపించినప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు రోగి ప్రాణాలను కాపాడటానికి ప్రధానంగా
ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అటోర్వాస్టాటిన్ ఈ మూడు రకాల మాత్రలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని కలిపి ఒక కిట్‌గా దగ్గర ఉంచుకోవడం వల్ల గుండెపోటు ముప్పు నుంచి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
* ఆ మూడు మాత్రలు:
ఆస్పిరిన్ (Aspirin – 325mg) : ఇది రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది.
క్లోపిడోగ్రెల్ (Clopidogrel – 300mg): ఇది రక్తనాళాల్లో రక్తాన్ని పల్చబరుస్తుంది.
అటోర్వాస్టాటిన్ (Atorvastatin – 80mg): ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తనాళాల్లో అడ్డంకులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
* ఎప్పుడు వేసుకోవాలి?
ఛాతిలో విపరీతమైన నొప్పి, ఎడమ చేయి లాగడం, దవడ నొప్పి లేదా విపరీతమైన చెమటలు పట్టినప్పుడు ఈ మూడు మాత్రలను వెంటనే మింగడం ద్వారా ఆసుపత్రికి చేరే వరకు గుండెకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.
– ఈ మందులు వేసుకున్న వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాలి.
– మీకు ఇప్పటికే అల్సర్ సమస్య ఉన్నా లేదా ఈ మందులతో అలర్జీ ఉన్నా వీటిని వాడకూడదు.
* వేసవిలో జాగ్రత్తలు..
-వేసవి కాలంలో ఎండల తీవ్రత వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అధిక వేడి వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది గుండె రోగులకు ప్రమాదకరం.
– ఎండ వల్ల శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. దీనివల్ల రక్తం చిక్కబడి గడ్డకట్టే (Blood Clots) అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
-మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి తీసుకోవడం చాలా మంచిది.
-ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడమే మంచిది. -అత్యవసరమైతే గొడుగు లేదా టోపీ ధరించాలి.
* ఆహార నియమాలు:
మసాలాలు, నూనె వస్తువులు, జంక్ ఫుడ్ తగ్గించాలి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.
తేలికగా అరిగే ఆహారం, పీచు పదార్థాలు (Fiber), పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
* మందుల వాడకంలో జాగ్రత్త:
బీపీ (BP), షుగర్ ఉన్నవారు డాక్టర్ సూచించిన మందులను ఒక పూట కూడా మానకూడదు.
వేసవిలో బీపీలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి.
* వ్యాయామం:
కఠినమైన వ్యాయామాలు ఎండలో చేయకూడదు. ఉదయాన్నే లేదా సాయంత్రం చల్లబడ్డాక మాత్రమే నడక వంటివి చేయాలి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “HEART ATTACK | హార్ట్ ఎటాక్ నుంచి ప్రొటక్షన్”