Invest Telangana Global Summit 2026
* రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
* కేంద్ర రక్షణ శాఖ మంత్రితో ఢిల్లీలో భేటీ
* డిసెంబర్ 7-9 డిఫెన్స్ ఎక్స్పో, ఎయిర్‌షో
* పలు అంశాలపై చర్చ
ఆకేరు న్యూస్, డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. సదస్సులో భాగంగా నిర్వహించే డిఫెన్స్ ఎక్స్పో 2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఢిల్లీలో పలువురు ఎంపీలు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు.
* ఎయిర్‌షో, రక్షణ ప్రదర్శనలు..
రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ ఎక్స్‌పోకు రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేయాలని విజ్ఞప్తి చేశారు.
* ఎయిర్‌షో అనుమతులు – వైమానిక దళాల ప్రదర్శన
అంతర్జాతీయ ప్రమాణాలతో రక్షణ ఎక్స్పో-2026ను విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని కోరారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనతో పాటు సైనిక, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని కోరారు.
* స్వదేశీ, విదేశీ సంస్థల భాగస్వామ్యం
హెచఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్‌లో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ చేపట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు. రక్షణ శాఖ కోరిన విధంగా మొత్తం 1500 ఎకరాల కోసం మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
* దేవరకద్రలో డీఆర్డీఎల్ ప్రాజెక్ట్
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ అంగీకరించిందని చెప్పారు. మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ. 1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాల కాలానికి కేటాయించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
