Revuri Prakash Reddy BRS Criticism
* అప్పుల ఊబిలో నెట్టిన గులాబీ పార్టీ
* మీ పాలనలో కూలేశ్వరంగా మారిన కాళేశ్వరం
* ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి
* హనుమకొండలో మీడియాతో సమావేశం
ఆకేరు న్యూస్, హనుమకొండ : ప్రజలను బీఆరఎస్ తప్పుదోవ పట్టిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు బుధవారం మీడియాతో సమావేశం నిర్వహించారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆరఎస్ పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలపై ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని బీఆరఎస్ ప్రభుత్వం భారీ అప్పుల ఊబిలోకి నెట్టిందని రేవూరి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆరఎస్ నేతలు ప్రజలకు నిజాలు చెప్పకుండా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. “కాళేశ్వరం మీ ప్రభుత్వ హయాంలో కూలేశ్వరంగా మారింది” అంటూ బీఆరఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పాటు పేపర్ లీకేజీ ఘటనల కారణంగా వేలాది మంది యువత తీవ్రంగా నష్టపోయారని రేవూరి మండిపడ్డారు.
* భారీ అప్పులున్నా సంక్షేమానికి పెద్దపీట : ఎంపీ కడియం కావ్య
వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాష్ట్రంపై భారీ అప్పుల భారం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎలాంటి భారం పడకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. మహిళలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
* రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాల అమలు
సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పార్టీలు, కార్యకర్తలు అనే వివక్ష ఉండదని ఎంపీ కడియం కావ్య స్పష్టం చేశారు. కేవలం అర్హత ఆధారంగానే ప్రభుత్వ పథకాల లబ్ధి అందిస్తామని తెలిపారు. ప్రతిపక్షాల నుంచి వచ్చే నిర్మాణాత్మక సూచనలు, సలహాలను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆరఎస్ పదేళ్ల పాలనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తెలంగాణ అభివృద్ధి, మహిళా సాధికారత, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
