*మూసీ పునరుజ్జీవం..
*భావి తరాల భరోసా – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మూసీ నది పునరుజ్జీవనం ఒక చారిత్రక అవసరమని, ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లో జరిగిన “మూసీ ఇన్వైట్స్” సదస్సులో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగిస్తూ, మూసీ ప్రాజెక్టుపై నెలకొన్న అపోహలను పటాపంచలు చేశారు. ఈ ప్రాజెక్టు కేవలం సౌందర్యీకరణ కోసం కాదని, నగరం యొక్క భవిష్యత్తు ఆర్థిక ప్రగతికి, పర్యావరణ పరిరక్షణకు పునాది అని ఆయన పేర్కొన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నాగరికతలు విలసిల్లాయని గుర్తు చేస్తూ.. లండన్‌లోని థేమ్స్, న్యూయార్క్‌లోని హడ్సన్, సియోల్, సింగపూర్ వంటి నగరాల అభివృద్ధిని ఉదాహరణగా చూపారు.
పేదల పక్షపాతిగా ప్రభుత్వం…
మూసీ పరీవాహక ప్రాంతంలోని సుమారు 10 వేల పేద కుటుంబాల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి మానవీయ కోణంలో స్పందించారు. “నిలువ నీడ లేని వారే మూసీ తీరాన దుర్భర జీవితం గడుపుతున్నారు. వారితో నాకు శత్రుత్వం ఏముంటుంది? వారి కళ్లలో ఆనందం చూడటమే నా లక్ష్యం” అని భావోద్వేగంగా పలికారు. ఇప్పటికే బాధితుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేశామని, ఉపాధి దెబ్బతినకుండా సమీప ప్రాంతాల్లోనే నివాస వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వివరించారు. ఈ ప్రాజెక్టు వెనుక ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు లేవని, కేవలం ప్రజా ప్రయోజనాలే పరమావధి అని ఆయన స్పష్టం చేశారు.
కాలుష్య కోరల నుంచి విముక్తి..
నగర జనాభా రాబోయే 25 ఏళ్లలో 2.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే భావి తరాలు మనల్ని క్షమించవని హెచ్చరించారు. మూసీ కాలుష్యం వల్ల కేవలం నగరం మాత్రమే కాకుండా, దిగువన ఉన్న నల్గొండ జిల్లా ప్రజలు కూడా కాలకూట విషంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నుంచి మూసీని విముక్తం చేసి, స్వచ్ఛమైన నీటి ప్రవాహంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు.
రాజకీయాలు వద్దు.. సూచనలు ఇవ్వండి…
ప్రాజెక్టు వ్యయంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. గాంధీ విగ్రహం ఏర్పాటుకు కేవలం రూ. 75 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని, మొత్తం ప్రాజెక్టు అంచనా రూ. 7 వేల కోట్లకు మించి లేదని వివరణ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును అడ్డుకోవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభలో కూడా దీనిపై చర్చ నిర్వహిస్తామని, నిపుణులు, మేధావులు, సాధారణ పౌరులు తమ అమూల్యమైన సూచనలను ప్రభుత్వం అందించిన వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని కోరారు.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి సాంకేతిక మార్పుల వల్ల ఉద్యోగ రంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మూసీ ప్రాజెక్టు ఒక వేదిక కానుందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా టూరిజం, నైట్ ఎకానమీ మరియు బ్లూ కాలర్ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నగరాభివృద్ధికి సద్వినియోగం చేస్తాను” అని చెబుతూ, హైదరాబాద్‌ను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సదస్సు ప్రారంభంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు ఇతర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.
