వరంగల్ కు మాస్టర్ ప్లాన్ – 2050
* భూగర్భడ్రైనేజీ ని అభివృద్ది నిర్మాణానికి డిటెయిల్ రిపోర్ట్
ఆకేరు న్యూస్, వరంగల్ : హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరాన్ని తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్ నగరంలో పర్యటించారు. గీసుకొండ మండలంలో ని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను సందర్శించారు. ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించిన కంపెనీలకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాన్ని పరిశీలించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు అనంతరం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని అందుకోసం అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గత యాభై ఏండ్లుగా వరంగల్ నగరానికి మాస్టర్ ప్లాన్ లేకుండా పోయిందన్నారు. నగర అభివృద్ధికి అత్యంత కీలకమైనది మాస్టర్ ప్లాన్ అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి సంబందించి పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేయాలన్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నగరం విస్తరిస్తున్నందున ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అనుసరిస్తున్న అధునాతన పద్దతులను వరంగల్‌లో కూడా అనుసరించే విదంగా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు.
మాస్టర్ ప్లాన్ -2050
మాస్టర్ ప్లాన్ లేకుండా నగర అభివృద్ధి ఎలా జరుగుతుంది . అందుకోసం వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ -2050 రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్‌కు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఔటర్ రింగ్ రోడ్‌కు అనుసంధాలించాలన్నారు. మడికొండ డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం కల్పిస్తామన్నారు. అదే విదంగా వరంగల్ నగర అభివృద్ధిలో కీలక అంశంగా భావించే మామునూర్ ఎయిర్ పోర్ట్ కు సంబందించి ఉన్న అడ్డంకుల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలయినంత తొందరగా ఎయిర్ పోర్ట్ ప్రారంభించడానికి అవసరమైన పనులు చేపట్టాలన్నారు.
——————