* ఉత్కంఠగా టీ20 వరల్డ్ కప్
* విక్టరీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా భారత్ నిరీక్షణ
* తొలి చాన్స్ చేజార్చుకోకూడదన్న పట్టుదలలో సౌత్ ఆఫ్రికా
* విజేత జట్టుకు భారీగా ప్రైజ్ మనీ
* వర్షం వస్తే ఫలితం ఎలాగంటే..?
ఆకేరు న్యూస్ స్పోర్ట్స్ డెస్క్ : ప్రపంచవ్యాప్త అభిమానులకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. ఈరోజు రాత్రి 8 ఎప్పుడవుతుందా అని నిరీక్షిస్తున్నారు. అందుకు కారణం.. టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2024 టైటిల్ మ్యాచ్. టీమిండియా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడి 11 ఏళ్లు కావడంతో భారత్‌లో ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్న సౌత్ ఆఫ్రికా (South Africa) జట్టు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహతహలాడుతోంది. వీరిలో గెలుపు ఎవరది అనేది బార్బడోస్‌లోని (Barbados) కెన్సింగ్టన్ ఓవల్‌లో నేటి రాత్రి తేలనుంది. ఇదిలాఉండగా కరీబియన్ దీవుల్లో వర్షం కురిసే అవకాశం 78 శాతం ఉందన్న వాతావరణ శాఖ ప్రకటన ఇరు క్రికెట్ల జట్లలోను, అభిమానుల్లోనూ కలవరం రేపుతోంది. అదే జరిగితే విజేతను పది ఓవర్ల మ్యాచ్ లోనే తేల్చనునన్నారు. అదీ వీలు కాకపోతే రిజర్వ్‌డే అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఆరోజు అంటే రేపు కూడా వర్షం పడితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించనున్నారు.
టైటిల్ కోసం టగ్ ఆఫ్ వార్
ఈ రెండు జట్లు ట్రోఫీని సొంతం చేసుకోవడానికి చాలా కసితో ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ తొలిసారి ప్రారంభమైన 2007లో గెలిచిన భారత జట్టు ఈ ఫార్మాట్లో మరోసారి విజేత కాలేకపోయింది. అలాగే 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచి, గతేడాది అజేయంగా ఫైనల్‌కు చేరినా నిరాశే ఎదురైంది. అందుకే ఈ రెండు ఫార్మాట్లలో సుదీర్ఘ ఎదురుచూపులకు తెరదించాలన్న కసితో రోహిత్ సేన ఉంది. మరోవైపు ఏ ప్రపంచక్పలోనైనా సఫారీలు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఐదుసార్లు వన్డే, రెండుసార్లు టీ20 వరల్డ్‌క్‌పల్లో సెమీస్ వరకు చేరి వెనుదిరిగారు. అందుకే మార్క్రమ్ సేనకు కూడా ఈ పోరు అత్యంత కీలకంగా మారింది. వరుణుడు కాస్త కరుణిస్తే టైటిల్ కోసం టగ్ ఆఫ్ వార్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది.
ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఇదిలా ఉంటే.. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం ఐసీసీ (ICC) ఇప్పటికే ప్రైజ్‌మనీ ప్రకటించింది. అయితే ఈసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది. అంతేకాదు.. ప్రైజ్ మనీ గెలిచిన జట్టుకే కాదు.. ఓడిపోయిన జట్టుకు కూడా లభించనుండటం విశేషం. ఈసారి టీ20 వరల్డ్ కప్ 2024 కోసం.. ఐసీసీప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు అంటే.. సుమారు రూ. 93.7 కోట్లు ప్రకటించింది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (India vs South Africa) తుదిసమరంలో విజేతగా నిలిచిన జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ. 20.42 కోట్లు లభించబోతోంది. అలాగే ఓడిపోయిన జట్టుకు కూడా 1.28 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 10.67 కోట్లు దక్కబోతోంది.
————–