Konda Surekha Chinna Reddy Congress Action
* నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* పలు అంశాలతో పాటు వీరిపై చర్యలకు అధిష్టానంతో చర్చలు ?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయనుందా ? ఈ విషయం నేడు (మంగళవారం) తేలనుందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అయితే, రాష్ట్ర కాంగ్రెస్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి వ్యవహారం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే అధిష్టానానికి నివేదిక అందజేసినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి పార్టీ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
