Revanth Telangana Unified Welfare Card
* సమగ్ర సంక్షేమ కార్డుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అందుతున్న వివిధ పథకాల లబ్ధిని క్రమబద్ధీకరించేందుకు ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ కార్డ్) రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి సహా పలువురు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుపై దిశా నిర్దేశం చేశారు.
* ఏఐ (AI) సాంకేతికతతో పారదర్శకత…
ఈ సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట లభిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో అన్ని కోణాల్లో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా అందుతాయి, అలాగే అనర్హులను ఏరివేయడం సులభమవుతుంది.” అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పాత పద్ధతికి స్వస్తి పలికి, ఐటీ శాఖ ఆధ్వర్యంలోనే ఈ సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.
* ఒకే కార్డులో ఏమేం ఉంటాయి..
ఈ యూనిఫైడ్ కార్డులో ప్రజా సంక్షేమానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు.
ఆరోగ్యం & బీమా: రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలు మరియు ప్రజల సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్.
విద్య & ఉపాధి: ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా శాఖ మరియు కార్మిక శాఖకు సంబంధించిన లబ్ధి వివరాలు.
సర్వేల అనుసంధానం: ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డుకు అనుసంధానిస్తారు.
యూనిక్ ఐడెంటిటీ: అవసరమైతే ఆధార్ తరహాలోనే రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక ‘యూనిక్ ఐడెంటిటీ నంబర్’ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
* డేటా సేకరణకు స్పెషల్ డ్రైవ్…
తక్షణమే అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖకు బాధ్యతలు అప్పగించారు.
ఈ వ్యవస్థ పూర్తిగా రియల్ టైమ్ డేటా ఆధారంగా పనిచేస్తుందని సీఎం వివరించారు. ఉదాహరణకు.. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం (Death Certificate) జారీ అయితే, ఆ సమాచారం తక్షణమే చేయూత పెన్షన్ డేటాబేస్కు చేరి, దానికి అనుగుణంగా తదుపరి చర్యలు ఆటోమేటిక్‌గా ప్రారంభమయ్యేలా ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సూచించారు.
* గల్ఫ్ వలసలపై ప్రత్యేక నిఘా.. ఏజెంట్ల దందాకు బ్రేక్!
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ కోసం కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట అందుబాటులో ఉంచాలని ఐటీ శాఖను ఆదేశించారు. దీనివల్ల అమాయక కార్మికులను మోసం చేసే అనధికార ఏజెంట్ల ప్రమేయానికి అడ్డుకట్ట పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు సంక్షేమ ఫలాలు 100 శాతం చేరడమే లక్ష్యంగా ఈ కార్డు పనిచేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
