
* గత ముఖ్యమంత్రులకు భిన్నంగా ఉండే యత్నం
* మాటల్లోనూ.. నడవడికలోనూ సాదాసీదా తీరు
* ప్రజల ముఖ్యమంత్రిగా పేరు పొందాలనే తాపత్రయం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటానని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనంలో ఒక్కడిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నమైన పంథా అవలంబిస్తూ ఆసక్తి రేపుతున్నారు. సీఎం హోదాకు తగ్గ హంగు ఆర్భాటాలు చేయకుండా సామాన్యుడిలా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తానూ ప్రజల్లో ఒక్కడినేనని చాటి చెప్పేలా అడుగులు వేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ నిమజ్జన వేడుకలకు సామాన్యుడిలా వెళ్లి పర్యవేక్షించడం.
రాజరికం అనే ధోరణికి చెక్
రేవంత్ రెడ్డి ఏమీ సాధారణ వ్యక్తి కాదు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన మహామహాలెందరో ఉన్నప్పటికీ.., తెలుగుదేశం నుంచి వచ్చి చేరి టీపీసీసీ పగ్గాలు చేపట్టారు. ఆయనకు అంత ఈజీగా ఆ హోదా దక్కలేదు. అందుకోసం ఎంతో శ్రమించారు. దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి కూర్చున్నారు. పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగడమే లక్ష్యమని బాహాటంగానే చెబుతున్నారు. ఆ దిశగానే అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే రాజరికం అనే రీతిలో వ్యవహరించిన సీఎంలకు భిన్నంగా సాదాసీదాగా వ్యవహరిస్తున్నారు. రాజరికాన్ని గుర్తుకు తెచ్చేలా వ్యవహరించే ధోరణికి సీఎం రేవంత్ చెక్ పెట్టారనే చెప్పాలి.
హంగు ఆర్భాటం లేకుండానే..
ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. వెంట భారీ కాన్వాయ్.. అధిక సంఖ్యలో పోలీసులు ఉంటారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ సీఎం రేవంత్ పర్యటనల్లో చాలా చోట్ల ఇవేమీ కనిపించడం లేదు. మూడు రోజుల క్రితం జరిగిన కామారెడ్డి పర్యటనలో అయినా, అంతకు ముందు హైదరాబాద్ లోని అమీర్ పేట సందర్శనకు వెళ్లిన సందర్భంలో అయినా, తాజాగా నిమజ్జన పర్వం వీక్షించేందుకు ఎన్టీఆర్ మార్గ్ కు వెళ్లిన సమయంలోనైనా సాదాసీదాగానే వ్యవహరించారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లిన సందర్భంలో బాధితులతో కలిసిపోయారు. వరద ముంపునకు గురైన కాలనీలన్నీ కాలినడకనే కలియ తిరిగారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాడే నిజమైన నాయకుడని చెప్పడమే కాకుండా, ఆచరించే నేతగా చర్చకు జరిగేలా ఆ పర్యటన సాగింది.
అమీర్‌పేటకు కూడా..
హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసి, ప్రధాన ప్రాంతమైన అమీర్‌పేట ముంపునకు గురైనప్పుడు కూడా సీఎం రేవంత్ నేరుగా అక్కడకు వెళ్లారు. ఆకస్మికంగా పర్యటించారు. అమీర్ పేట పరిధిలోని ముంపు ప్రాంతాల్ని పరిశీలించి.. బాధితులకు అందాల్సిన సాయంతో పాటు.. ముంపు నివారణకు ఏమేం చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని చర్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి.. అధికార నివాసానికి దగ్గరగా ఉండే అమీర్ పేటకు ఒక ముఖ్యమంత్రి వెళ్లి.. ఆ ప్రాంతంలో తిరగడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి వెళ్లి వచ్చిన తర్వాత ముంపు సమస్య పరిష్కారంపై అధికారులు సీరియస్ గా దృష్టి కేంద్రీకరించారు. సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. వరద నీటి మళ్లింపునకు అధికారులు పరిష్కారమార్గాలనూ కనుగొన్నారు.
నిమజ్జనం రోజున ..
తాజాగా గణపతి నిమజ్జనం సందర్భంగా సాధారణ భక్తుడిలానే రేవంత్ జనాల్లోకి వచ్చారు. సచివాలయం నుంచి ఎన్టీఆర్ మార్గ్ కు నేరు గా విచ్చేశారు. పరిమిత కాన్వాయ్ తో, ఎటువంటి హడావిడి లేకుండా, ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా నేరుగా నిమజ్జన ప్రాంతానికి విచ్చేశారు. అందరినీ పలకరించుకుంటూ, షేక్ హ్యాండ్ లిచ్చుకుంటూ కదిలారు. అడిగినవారితో ఫొటోలు దిగారు. ఒక ముఖ్యమంత్రి నిమజ్జన వేళ స్వయంగా రావటం గడిచిన నలభై ఐదేళ్ల వ్యవధిలో ఇదే తొలిసారి అని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రకటించడాన్ని పరిశీలిస్తే సీఎం వినూత్న శైలి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా పరిశీలిస్తే రేవంత్ వేస్తున్న అడుగులు ఆసక్తి గొలుపుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
……………………………………………