– వరుస అగ్నిప్రమాదాలతో కలకలం
– పరిశ్రమల్లో పెరుగుతున్న ప్రమాదాలు
ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరగడం చూస్తూనే ఉంటాం. వేడి కారణంగా చిన్న నిప్పురవ్వ ఎగిసినా మంటలు వ్యాపిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా ఈఏడాది చలికాలంలో అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే తెలంగాణలో పలు ప్రాంతాల్లో దాదాపు పదికి పైగా అగ్నిప్రమాదాలు సంభవించాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఆకేరు న్యూస్ ప్రతినిధి, హైదరాబాద్ : హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్ఎస్వీ ఫ్యాబ్ ఇండస్ట్రీస్‌లో మూడు రోజుల క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 40 గంటలపాటు మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పరిశ్రమకు చెందిన నాలుగు అంతస్తుల్లోని మూడు అంతస్తులు మంటల వేడికి కుప్పకూలాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకపోయినా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదే రోజు అదే పారిశ్రామికవాడలోని యస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాన్ల కర్మాగారంలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ యంత్రం వద్ద ఎగిసిపడిన మంటలు పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలు మరువక ముందే గురువారం సంగారెడ్డి జిల్లాలోని ఖాజీపల్లి పారిశ్రామికవాడలోని అరోరా లైఫ్ సైన్సెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్లలో సాల్వెంట్స్ మిక్స్ చేస్తుండగా పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. అంతేకాదు.. నారాయణపేట జిల్లా ధన్వాడకు సమీపంలోని లింగంపల్లి భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో కూడా అదే రోజు అగ్గిరాజుకుంది. కేబుల్ వైర్ తెగిపడి విద్యుదాఘాతానికి నిప్పురవ్వలు ఏర్పడి ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
రక్షణ చర్యలు శూన్యం
గజగజ వణికించే చలికాలంలో వరుస అగ్నిప్రమాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్లు పేలడం, ఇళ్లలో జరిగిన ప్రమాదాలతోపాటు దుకాణాలు, కర్మాగారాల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరిగాయి. సరైన నిర్వహణ లేకపోవడం, నిపుణులైన సిబ్బంది లేకపోవడం, ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణాలు జరిపితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గడంతోపాటు, త్వరగా మంటలను అదుపులోకి తేవచ్చు. కానీ అపార్ట్మెంట్లు, దుకాణాలు, హోటళ్లు, కర్మాగారాలు నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్నారు. అంతేకాకుండా అపార్ట్మెంట్లు, దుకాణాలు, హోటళ్లు, కర్మాగారాల్లో ఎలాంటి రక్షణ చర్యలు పాటించడం లేదు.
ప్రమాదాల్లో కొన్ని..
హైదరాబాద్‌లోని మణికొండలో గురువారం కార్తీక పూజల కోసం ఏర్పాటు చేసిన దీపం కారణంగా ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తినష్టం జరిగింది. ఈ ప్రమాదంతో అపార్ట్‌మెంట్‌వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలాగే, జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పైస్ కిచెన్‌లో ఈనెల 14న గ్యాస్ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ గాయపడగా… పేలుడు ధాటికి ప్రహరీగోడ శిథిలాలు ఎగిరిపడి పక్కనున్న మూడు గుడిసెలు ధ్వంసమయ్యాయి. యూసఫ్‌గూడలోని హైదరాబాద్ బిర్యానీ భవన్లో జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు రూ.12లక్షల మేర ఆస్తినష్టం సంభవించింది. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ పరిధిలో పలు స్ర్కాప్ దుకాణాలు, గోదాముల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేవలం ఆస్తినష్టం జరిగింది.
……………………………………………………