Hanumkonda Tourism Reels Contest
* హనుమకొండ పర్యాటక వైభవాన్ని చాటేలా ఉండాలి
*మే 21న కలెక్టరేట్లో ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ప్రత్యేక సమావేశం
– జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
ఆకేరు న్యూస్ , హనుమకొండ :
హనుమకొండ జిల్లా చారిత్రక, పర్యాటక రంగాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వీడియోలు చేస్తే నగదు బహుమతులు అందిస్తమని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా ‘రీల్స్ వీడియో కాంపిటీషన్స్ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఈ నెల 21 తేదీ ఉదయం 11:00 గంటలకు కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
* పర్యాటక వారోత్సవాల్లో భాగస్వామ్యం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ పర్యాటక వారోత్సవాలలో భాగంగా ఈ వినూత్న పోటీని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పోటీల్లో హనుమకొండ జిల్లాకు చెందిన వారే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు.
* ఇవే పోటీ నిబంధనలు
హనుమకొండ జిల్లా పర్యాటక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు (హెరిటేజ్), సంస్కృతి, సాంప్రదాయాలపై రీల్స్/వీడియోలు రూపొందించాలి. పోటీకి పంపే వీడియోలు తప్పనిసరిగా *4K (Ultra HD)* క్వాలిటీలో ఉండాలి.
మే 21 నుండి మే 30 సాయంత్రం 5:00 గంటల లోపు వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది.
ఆసక్తి గల క్రియేటర్లు తమ వీడియోలను పెన్ డ్రైవ్ (Pen Drive) ద్వారా హనుమకొండ జిల్లా పౌర సంబంధాల శాఖ (DPRO) కార్యాలయంలో నేరుగా అందించవచ్చు. ఆన్లైన్ ద్వారా పంపాలనుకునే వారు హనుమకొండ డీపీఆర్ఓ (DPRO Hanamkonda) కు ఆన్లైన్ లింక్స్ ద్వారా పంపించవచ్చు.
* ఇవీ నగదు బహుమతులు:
పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాలకు కింది విధంగా నగదు బహుమతులు అందజేస్తారు:
* ప్రథమ బహుమతి:* రూ. 15,000/-
* ద్వితీయ బహుమతి:* రూ. 10,000/-
* తృతీయ బహుమతి:* రూ. 5,000/-
వీడియోలను నిపుణుల కమిటీ పరిశీలించిన అనంతరం, సెప్టెంబర్ 27న జరిగే ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ (World Tourism Day) సందర్భంగా విజేతల వివరాలను అధికారికంగా ప్రకటించి, బహుమతులు అందజేస్తారు. ఒకవేళ బహుమతులు రాకపోయినప్పటికీ, కంటెంట్ మరియు మేకింగ్ బాగున్న రీల్స్‌ను సదరు క్రియేటర్ల పేర్లతో (Instagram/YouTube Tags) జిల్లా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కొలాబరేషన్స్ (Collaboration) ద్వారా పబ్లిష్ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. దీనివల్ల హనుమకొండ పర్యాటక ప్రాంతాలతో పాటు స్థానిక క్రియేటర్లకు కూడా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జిల్లా మరియు పరిసర ప్రాంతాలలోని డిజిటల్ క్రియేటర్లు, యువత ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
—————————
