Medical Shops Strike India
* కొన్ని మెడికల్ షాపులకు సడలింపులు
ఆకేరు న్యూస్, వరంగల్ :
దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ఒక రోజు పూర్తి స్థాయి బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 12.40 లక్షలకు పైగా మందుల షాపులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు తమ షాపులను బంద్ చేసి దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయనున్నారు.
* ఇ-ఫార్మసీల పోటీని తట్టుకోలేక పోతున్నాం
టాటా 1mg, ఫార్మ్ ఈజీ వంటి బడా కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ద్వారా మందులను విక్రయిస్తూ.. సాధారణ రిటైల్ షాపులు ఇవ్వలేని విధంగా 20% నుంచి 60% వరకు భారీ డిస్కౌంట్లు (Deep Discounts) ఇస్తున్నాయి. ఈ డిస్కౌంట్ వల్ల గ్రామాలు, పట్టణాలు , నగరాల్లో ఉన్న మందుల షాపుల మనుగడ ప్రమాదంలో పడింది.
అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లను సరిగ్గా వెరిఫై చేయడం లేదని కెమిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒకే ప్రిస్క్రిప్షన్‌తో పదే పదే మందులు ఆర్డర్ చేయడం, ఏఐ (AI) ద్వారా సృష్టించిన నకిలీ ప్రిస్క్రిప్షన్లను వాడటం వల్ల యాంటీబయాటిక్స్, నిద్రమాత్రలు, మరియు అలవాటుగా మారే ప్రమాదకరమైన మందులు (Habit-forming drugs) యువతకు సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ప్రజలకు అత్యవసరంగా మందులు చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం హోమ్ డెలివరీకి తాత్కాలిక అనుమతులు (G.S.R. 220(E)) ఇచ్చింది. మహమ్మారి ముగిసి ఇన్నేళ్లవుతున్నా ఆ నిబంధనలను ఇంకా కొనసాగిస్తూ ఆన్లైన్ సంస్థలు దాన్ని వ్యాపార ప్రయోజనానికి వాడుకుంటున్నాయని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు.
* కోవిడ్ నిబంధనలను వెంటనే ఉపసంహరించాలి
కరోనా సమయంలో మందుల హోమ్ డెలివరీ కోసం తెచ్చిన తాత్కాలిక జీవో (G.S.R. 220(E)) ను వెంటనే రద్దు చేయాలి.ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ కోసం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (G.S.R. 817(E)) ను కఠినమైన నిబంధనలతో వెంటనే అమలు చేయాలి లేదా ఉపసంహరించుకోవాలి. ఆన్లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారులకు ఒకే విధమైన డ్రగ్ నిబంధనలు వర్తింపజేయాలని మందుల షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లను నియంత్రించి, మార్కెట్లో సమాన అవకాశాలు కల్పించాలి.ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో యాంటీబయాటిక్స్ అమ్మడాన్ని అరికట్టాలి
* ఈ మెడికల్ షాపులు తెరిచి ఉంటాయి
బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలుకు ఇబ్బంది కలగవచ్చు. అయితే, ప్రజల అత్యవసర అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని మినహాయింపులు ఇచ్చారు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు యథావిధిగా పనిచేస్తాయి. ఇన్-పేషెంట్లకు, ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో మందులు కావాల్సిన వారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను తెలంగాణలో 75693 59595, 92810 94907) అందుబాటులోకి తెచ్చారు.
మెడ్‌ప్లస్ (MedPlus) ఈ బంద్‌లో పాల్గొనడం లేదు, అలాగే అపోలో (Apollo) ఫార్మసీలు కూడా కనీసం 50 శాతం స్టోర్లను తెరిచి ఉంచుతామని ప్రకటించాయి.
——————————————
