* కంపల్సరీ ఓటింగ్ అంటే..?
* కంపల్సరీ అవసరమేనా..?
* ఏయే దేశాల్లో ఓటింగ్ కంపల్సరీ అంటే..
అకేరు న్యూస్, హైదరాబాద్ :
అవును.. ఓటరై ఉండి.. ఓటు వేయకపోతే కొన్ని దేశాల్లో జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ పథకాలకు అనర్హులే. యువతరంలో ఆసక్తి సన్నగిల్లుతుండడంతో కొన్ని దేశాలు కంపల్సరీ ఓటింగ్‌ను అమలు చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం ఇటీవల వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం.. దేశంలో ఎన్నికల వేళ 18 ఏళ్లు నిండి ఓటు వేయడానికి అర్హులైన కొత్త ఓటర్లు 49 మిలియన్ల మంది ఉంటే, కేవలం 18 మిలియన్ల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక యువత కలిగిన బీహార్‌లో కేవలం 17ుమాత్రమే ఓటు కోసం నమోదు చేసుకున్నారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. ఢిల్లీలో ఇది 21ుగా ఉంటే, అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 23ుగా ఉందని చెబుతుంది. మరి మన హైదరాబాద్‌లో ఇది ఎంత అని అంటే… కేవలం 76,833 (18-19 సంవత్సరాల నడుమ వయసు వారు) మంది నమోదు చేసుకున్నారు. నమోదు ఇలా ఉంటే.. ఓటు వేసే వారు అంతకంటే తక్కువే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కంపల్సరీ ఓటింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
*కంపల్సరీ ఓటింగ్ అంటే..?
ఓటు వేయడం అనేది బాధ్యత. కానీ, హక్కులు గురించి మాట్లాడే చాలామంది ఈ బాధ్యతను నిర్వర్తించడానికి మాత్రం కొందరు ఆసక్తి చూపడం లేదు. ప్రజలలో ఓటింగ్ పట్ల నిరాసక్తత గమనించి కొన్ని దేశాలు ఓటింగ్‌ను కంపల్సరీ చేశాయి. మరికొన్ని దేశాలైతే ఓటు వేయకుంటే జరిమానాలూ విధిస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు కాదు.. 1892లోనే బెల్జియంలో ఓటు తప్పనిసరిగా వేయాలని నిబంధన తీసుకువచ్చారు. అర్జెంటీనా లో 1914లో, ఆస్ట్రేలియాలో 1924లో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఇప్పటికీ దీనిని అమలు చేస్తుంది. నెదర్లాండ్స్, వెనుజులా లాంటి దేశాలలో ఈ నిబంధన కొంతకాలం అమలు చేశారు కానీ, ఆ తరువాత ఈ నిబంధన ఎత్తేశారు.
*కంపల్సరీ అవసరమేనా..?
కంపల్సరీ ఓటింగ్ అనేది అవసరమా అని అంటే, భిన్న వాదనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడతాయనే భావన మాత్రం అన్ని చోట్లా ఉంది. ఓటింగ్ అనేది స్వచ్ఛందంగా ఉండాలంటూనే, కంపల్సరీ ఓటింగ్ అంటే, ఏదో ఒకటి అనే భావనతో అనర్హులను కూడా అందలం ఎక్కించే అవకాశాలు లేకపోలేదు అని చెబుతున్నారు. ఇండియా లాంటి దేశాలలో కంపల్సరీ ఓటింగ్ అనేది కష్టమేనంటూ, ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించడమే మార్గమంటున్నారు మరికొందరు మేధావులు.
* ఏయే దేశాల్లో ఓటింగ్ కంపల్సరీ ..
– అర్జెంటినాలో 1912నుంచి ఓటు వేయడం తప్పనిసరి. 16-18 మధ్య సంవత్సరాల వ్యక్తులకు స్వచ్ఛందం కానీ, మిగిలిన వారికి మాత్రం ఓటు వేయడం తప్పని సరి.
– ఆస్ట్రేలియాలో 1924 నుంచి ఓటు వేయడం తప్పనిసరి. ఓటు వేయకపోతే 20 డాలర్ల నుంచి 50 డాలర్ల వరకూ జరిమానా ఉంటుంది.
– బ్రెజిల్లో 1932లో కంపల్సరీ ఓటింగ్ పరిచయం చేశారు. కాకపోతే నిరక్ష్యరాసులు, 16-18 సంవత్సరాల యువత, 70 ఏళ్లు దాటిన వారికి మాత్రం ఐచ్ఛికం.
– సింగపూర్ లో సరైన కారణం చెప్పకపోతే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. మరలా నమోదు చేసుకోవాలి. సరైన కారణం చెప్పకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
– బెల్జియం లాంటి దేశాలలో ఓటరు కాకపోతే, ప్రభుత్వ ఉద్యోగం పొందడం కష్టమే.
————-