* న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాం
* దేశ చరిత్రలో ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్
* మోసపూరిత హామీలతో తెలంగాణలో అధికారంలోకి
* ఆరు గ్యారెంటీలు మాయమైపోయాయి
* ఢిల్లీలో మీడియా సమావేశంలో కేటీఆర్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, ఇప్పటికే అపాయింట్మెంట్ కోరామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తెలిపారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. న్యాయ నిపుణులను సంప్రదించి తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్ సురేశ్‌తో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా పార్టీ మారితే వెంటనే డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయసంహితలో ఉందని, ఇప్పుడు కాంగ్రెస్సే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశ చరిత్రలో పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ సంస్కృతినే బీజేపీ అవలంబిస్తోందన్నారు.
హామీల అమల్లో విఫలం
ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటి వరకు జాబ్ కేలెండర్ ఊసేలేదు అన్నారు. ఆరు గ్యారెంటీలు (Six guarantees) మాయమైపోయాయని తెలిపారు. కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే తాము ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి, ఆ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
——————————-