* శాశ్వత నిర్మాణాలపై దృష్టి
* అభివృద్ధి పనులపై సమీక్షకు మేడారానికి సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణలో అతిపెద్ద సంబురంగా గుర్తింపు పొందిన సమ్మక-సారలమ్మ జాతర జరిగే మేడారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది. కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరులో వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుపుకుంటారు. కుంభ మేళా తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను నాటి రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఒడిషా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది.
మేడారానికి రేవంత్
ఏడాది పొడవునా భక్తులు సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించడానికి మేడారంకు తరలివస్తుంటారు. ముఖ్యంగా వారాంతాలు, సెలవుదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మేడారం ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా మేడారంలో పర్యటించనున్నారు. మహా జాతర ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై పూజారులు, ఆదివాసీ నేతలు, గిరిజన ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇప్పటికే సోమవారం ఆయన కార్యాలయంలో అధికారులు, మంత్రులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గ్రానైట్, లైమ్‌స్టోన్ వంటి సహజ పదార్థాలను వినియోగించాలని నిర్ణయించారు.
అభివృద్ధి పనులు
అభివృద్ధిలో భాగంగా గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడం, ద్వారాల సంఖ్య పెంచడం, భారీ స్వాగత తోరణాల నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రత్యేకంగా తోరణాల ఎత్తు 40 అడుగుల వరకు పెంచాలని యోచిస్తున్నారు. భక్తుల రద్దీ సమయంలో తోపులాటలు జరగకుండా క్యూలైన్లను బలపరుస్తారు. గద్దెల చుట్టూ ర్యాంపులు, ఎత్తైన ప్రదేశాలు నిర్మించి భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటారు. వచ్చే ఏడాది జనవరి చివర్లో జరగబోయే మహా జాతర దృష్ట్యా ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అందులో రూ.91 కోట్లు రోడ్ల విస్తరణ, వంతెనలు, కాలువల నిర్మాణానికి వినియోగించనున్నారు. మిగిలిన నిధులతో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సౌకర్యాలు, భక్తులకు అవసరమైన తాత్కాలిక వసతులు కల్పించనున్నారు. అలాగే జాతర నేపథ్యంలో మంత్రి సీతక్క కూడా తరచూ మేడారాన్ని సందర్శిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చేపట్టే చర్యలపై అధికారులతో మాట్లాడుతున్నారు.
………………………………………………..
