MLA Kadiyam Srihari Rahul Gandhi Congress
* రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: కార్యకర్తల ఐక్యతే పార్టీకి బలం, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం అని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్, జఫర్గఢ్ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, నూతన గ్రామ కమిటీల పరిచయ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నూతన గ్రామ కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పార్టీకి తిరుగులేని విజయాలు అందించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన చిల్పూర్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల స్వంత భవన నిర్మాణాలకు దసరా లోపు శంకుస్థాపన చేస్తానని అన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలను తెలంగాణ ప్రజలకు పంచాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఈ మాట నేను అనడం లేదని స్వయాన 10 ఏళ్ళు అధికారాన్ని పంచుకున్న కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందిస్తూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదనే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలు చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ నాయకత్వం తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ కమిటీలు కాంగ్రెస్ పార్టీకి పునాదిలాంటివని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీని బలోపేతం చేయాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య పిలుపునిచ్చారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడంతో పాటు తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు సర్పంచులు మేనక, లావణ్య, నరసింహారెడ్డి, కర్ణాకర్, లక్ష్మి నాయకులు బొమ్మిశెట్టి బాలరాజు, ఎండి షకిల్, గడ్డమీద సురేష్, మల్లారెడ్డి, రాజన్ బాబు, పొన్నం కుమార్ వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
