* తెలంగాణ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక
* జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
– సీ.ఎస్ శాంతి కుమారి.
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తర తెలంగాణ లోని 11 జిల్లాలలో ఈనెల 20, 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari) సూచించారు. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ (Orange Alert) ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనితోపాటు 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు పక్కా భవనాల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనా, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం తదితర అంశాలపై కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీ.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది, ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ 11 జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని తెలియచేశారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగుకు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను సీ.ఎస్ అభినందించారు.
* కొత్త మెడికల్ కాలేజీలకు పక్కా భవనాలు గుర్తించండి
ప్రభుత్వం కొత్తగా ఎనిమిది జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు తాత్కాలిక ప్రాతిపదికన పక్కా భవనాలను గుర్తించడం తోపాటు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాలు కలెక్టర్లకు సూచించారు. గద్వాల్, నర్సంపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, యాదాద్రి భువనగిరి, నర్సంపేట, మెదక్ జిల్లాలో, ఇప్పటికే భువనగిరి, మెదక్ జిల్లాల్లో కాలేజి భవనాలను గుర్తించారని తెలిపారు. ఈ రెండు జిల్లాలు ఆయా భవనాలను 40 ఏళ్ల లీజ్ అగ్రిమెంట్ చేసుకోవాలని కలెక్టర్లకు తెలిపారు. ఈ ఎనిమిది జిల్లాలలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 220 పడకల ఆసుపత్రులను అనుసందానం చేయాలన్నారు. అదేవిధంగా, ఈ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించాలని తెలిపారు. టీచింగ్ స్టాఫ్ నియామకం పై వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని అదేవిధంగా సీటీ స్కాన్ మిషన్లు, బయో మెట్రిక్ అటెండెన్స్ మెషిన్లను హైదరాబాద్ లోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ సరఫరా చేస్తుందని తెలిపారు.
————————————————————