AP Telangana Water Dispute CM Meeting
* తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నది జలాల వివాదం
* త్వరలో సీఎంల భేటీ?
* సీడబ్ల్యూసీ సిఫారసు
* తాజాగా ఢిల్లీలో కీలక భేటీ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కృష్ణా, గోదావరి నదీ జల వివాదాల పరిష్కారం దిశగా కేంద్ర జల సంఘం చైర్మన్ సమక్షంలో ఢిల్లీలో సమావేశం జరిగింది. గతంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తి మంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి భేటీకి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో భేటీ జరిగినా, తదుపరి చర్చలకు అవసరమైన స్పష్టమైన ఎజెండా ఖరారు కాకపోవడంతో సీడబ్ల్యూసీ చొరవ తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహించింది.
* కీలక అంశాలపై చర్చ
ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు మరియు సీనియర్ అధికారులు హాజరయ్యారు. జల వివాదాల పరిష్కారానికి సంబంధించి ఇరు రాష్ట్రాలు తమ ప్రాధాన్యతా అంశాల జాబితాను సమర్పించాలని గతంలో సీడబ్ల్యూసీ లేఖలు రాసినా స్పందన ఆలస్యమైంది. దీంతో స్వయంగా సీడబ్ల్యూసీ చైర్మన్ రంగంలోకి దిగి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాగర్ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల, శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటి మట్టాల నిర్వహణ, తాగునీటి అవసరాల కేటాయింపులపై ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలించడం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.
* అనుమతులు లేని ప్రాజెక్టుల వివాదం
రెండు రాష్ట్రాల పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ పరస్పరం చేసుకుంటున్న ఫిర్యాదులు, ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలపై స్పష్టత కోసం ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ, తెలంగాణ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, సాంకేతిక నిపుణులు ఈ భేటీకి హాజరయ్యారు. ఉమ్మడి ప్రాజెక్టుల నీటి పంపిణీ, బోర్డుల పరిధి, భద్రతా అంశాలపై గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రధానంగా 5 అంశాలతో సిడబ్ల్యూసీ ఎజెండాను ఖరారు చేసింది.
* నెలాఖరులో సీఎంల సమక్షంలో తుది భేటీ ?
ఈ రోజు ఖరారు చేసిన ఎజెండా ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకునేందుకు సెప్టెంబర్ చివరి వారంలో కేంద్ర జలశక్తి మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మలివిడత శ్రేణి సమావేశాన్ని నిర్వహించాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
