Dairy Farmers
Dairy Farmers| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఉదయ్ ముక్తాపురం, తాటికొండ బ్రాంచ్ మేనేజర్ శోభన్ బాబు సూచించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం ఫతేపూర్‌లో శుక్రవారం పాడి రైతులతో సమావేశం నిర్వహించారు.
విజయ డైరీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా పాడి రైతులకు సులభతరంగా, తక్కువ వడ్డీకే రుణాలు అందించేందుకు బ్యాంకు ముందుకొచ్చిందని తెలిపారు. విజయ డైరీకి పాలు పోసే రైతులకు సిబిల్ స్కోర్ ఆధారంగా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు.
ఒక్కో రైతుకు రెండు గేదెల కొనుగోలు కోసం లేదా గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణం అందిస్తామని వివరించారు. ఇందులో 90 శాతం రుణాన్ని బ్యాంకు అందిస్తుందని, మిగిలిన 10 శాతం మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుందని తెలిపారు. డైరీ ద్వారా వచ్చే ఆదాయంతోనే నెలవారీ వాయిదాలు చెల్లించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
ఫతేపూర్తో పాటు కృష్ణాజిగూడెం, మీదికొండ, తాటికొండ గ్రామాల పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న రైతులు తాటికొండ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో ఖాతాలు తెరిచి రుణ సదుపాయాన్ని పొందాలని సూచించారు.
ఈ సమావేశంలో ఫతేపూర్ విజయ డైరీ చైర్మన్ బానోతు బాలరాజు, కృష్ణాజిగూడెం చైర్మన్ సాదం రమేష్, సర్పంచ్ లక్ష్మి, ఉమ్లా నాయక్, మాజీ సర్పంచ్ రూప్లా నాయక్, మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి, పాడి రైతులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
