* దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణ జరుపుతున్న సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తాను మాత్రం కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేనేనని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కుండబద్దలు కొట్టారు. తాను ఏ పార్టీలో ఉంటే, ఆ పార్టీ గెలుస్తుందని, అదే తన ప్రత్యేకత అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా తిరిగి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి గ్రేటర్‌లోని 300 డివిజన్లనూ గెలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత బడ్జెట్ కేటాయిస్తూ, హైదరాబాద్‌ను ఇంత అభివృద్ది చేస్తుంటే మరో పార్టీ గెలుస్తుందన్న ఆలోచనే అవసరం లేదన్నారు.
ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసులో దానం నాగేందర్ ఇంత వరకు విచారణకు హాజరుకాలేదు. గడువు కోరారు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో దానంపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం బీఆర్ ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు పోరాటం చేస్తున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ అనర్హత పిటిషన్లను ఇటీవల కొట్టివేయడం తెలిసిందే. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డిసెంబర్ నెలలోనే కొట్టివేశారు.
…………………………………………..

