ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ :
యురేకా సకామికా.. అంటూ ఎగిరిగంతేసినా..
అబ్బనీతియ్యనీ దెబ్బ.. అని సింపుల్ గా కాళ్లు కదిలించినా..
దాయిదాయిదామ్మా.. అని స్టైల్‌గా వీణ మోగించే భంగిమైనా..
ఈ పేటకు నేనే మేస్త్రీ.. అని మాస్‌గా మైమరిపించినా..
బంగారుకోడిపెట్ట.. అంటూ ఉర్రూతలూపినా..
అందులో ఓ రిథమ్ ఉంటుంది. ఆ మూమెంట్లో ఓ ఎట్రాక్షన్ ఉంటుంది. ఆ డ్రాన్స్ లో ప్రత్యేక స్టైల్ ఉంటుంది. డ్యాన్స్ ల్లో ఆ గ్రేస్.. ఆ పాపులారిటీ సినీ పరిశ్రమలో ఒకరికే సొంతం. ఎస్.. దటీజ్ మెగాస్టార్. ఆయన డ్యాన్స్ చేస్తుంటే.. చూపు తిప్పుకోలేరు. గిట్టనివాళ్లు కూడా పొగడక ఉండలేరు. డ్యాన్స్ ల్లో అంతటి ఇమేజ్ చిరంజీవికి మాత్రమే సొంతం. ఇప్పుడు కుర్రహీరోలు బాడీ మొత్తం తిప్పుతూ.. డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆ డ్యాన్స్ కు కేరాఫ్‌గా చిరంజీవి అని పేర్కొనడం అతిశయోక్తి కాదు. ‘‘హే.. పాప.. పాప పా ..పాప.. ఓ పాప..పాప..’’ అంటూ త్రినేత్రుడు సినిమాలో వేసిన బ్రేక్ డ్యాన్స్ తో థియేటర్లను షేక్ చేశాడు. బ్రేకేస్తే.. ..షేకు..నీకేలేరా.. అంటూ డాన్స్ ల్లో కొత్తదనాన్ని పరిచయం చేశాడు. ‘‘మెరుపులా లా లా.. ఆడతా.. తా తా.. దమ్ముంటే కాస్కో..’’ అని అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా నుంచి డ్యాన్స్ ను మరింత చాలెంజింగా తీసుకున్నాడు. అదే ఆయనను సినీ పరిశ్రమలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. డ్యాన్స్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే డ్యాన్స్ గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డ్యాన్స్ మూమెంట్స్ చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కింది. డ్యాన్స్ గురించి చిరంజీవి కూడా మాట్లాడుతూ.. తాను నటనకు ఓనమాలు దిద్దే కంటే.. డ్యాన్స్ కే ముందు ఓనమాలు దిద్దానని, చిన్నతనంలో తన చుట్టు ఉన్నా వారికి ఎంటర్టైన్ చేయడానికి వేసిన చిందులేసేవాడిననీ, కాలేజ్ డేస్ లో ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తూ తన చూట్టు ఉన్నావారిని ఎంటర్టైన్ చేసేవాడిననీ వెల్లడించారు. అలా డ్యాన్స్ మీద ఆసక్తి పెరిగిందన్నారు. తన జీవితంలో ఓ అంతర్బాగంగా మారిపోయిందన్నారు చిరంజీవి.
* తొలి షూటింగ్ సమయంలో ఏం జరిగిందంటే..
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తన తొలి సినిమా షూటింగ్ సమయంలో సంఘటనను పంచుకున్నారు. ఆ మూవీ షూటింగ్ ఖాళీ సమయంలో తాను వర్షంలో డ్యాన్స్ చేశాననీ, తన డ్యాన్స్ చూసి తన తోటి వారు చాలా మెచ్చుకున్నారన్నారు. ఈ విషయం దర్శక, నిర్మాతలకు కూడా తెలియడంతో.. ఆ తరువాత మూవీలో తన పాత్రకు డ్యాన్స్ చేసే అవకాశం లేకున్నా.. తన కోసం పాట పెట్టి తనను డ్యాన్ చేయించారన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన డ్యాన్స్ తనకు అవకాశాలు తెచ్చిపెట్టిందన్నారు. తాను నటించే సినిమాల్లో దర్శక, నిర్మాతలు గానీ, కొరియోగ్రాఫర్స్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ లు ప్రత్యేక శ్రద్దపెట్టేవారని అన్నారు. తన కోసం సినిమాల్లో ఆరు పాటలు పెట్టేవారని వివరించారు. తన డ్యాన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిందన్నారని చిరంజీవి పేర్కొన్నారు.
…………………………………