
* ప్రజల ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వం మాది
* బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరించినా కుట్రలు మానడం లేదు
* కాంగ్రెస్ను ఓడిరచాలంటున్న వారు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదు
* పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, నిజామాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రభుత్వాన్ని బలహీనపర్చాలని చూస్తున్నాయని, నాలుగు కోట్ల ప్రజల ఆలోచనలతో ఎన్నికైన ప్రజాప్రభుత్వమని తమదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రజలు తిరస్కరించినా బీఆర్ఎస్ కుట్రలు మానడం లేదని ఆరోపించారు. తెలంగాణతో బీఆర్ఎస్ కు పేరు బంధమే కాదు.. పేగు బంధం లేదని తరిమి కొట్టారన్నారు. కాంగ్రెస్ ను ఓడిరచాలంటున్న బీఆర్ఎస్ వాళ్లు ఎవరికి ఓటు వేయాలో చెప్పడం లేదన్నారు. ముందు మీ పరిస్థితిని మీరు అంచనా వేసుకోవాలని హితవు పలికారు. అభ్యర్థి లేని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలిచిందన్నారు. 10 నెలల పాలనలో కాంగ్రెస్ ఏమీ చేయలేదని అంటున్న బీఆర్ఎస్ వాళ్లు తమ పదేళ్ల పాలనలో ఏం చేశారోచెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ హైదరాబాద్ లోని అశోక్ నగర్, దిల్ సుఖ్ నగర్ , అమీర్ పేట్ చౌరస్తాల్లోని కోచింగ్ సెంటర్ల చుట్టూ పదేళ్లు తిరగడానికే సరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇచ్చి వాళ్లే కోర్టులకు వెళ్లారని, పదేళ్లు ఉద్యోగార్థులను కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 55,163 ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇందులో 11వేల టీచర్లు, 15వేల పోలీసులు, 6వేల మెడికల్ సిబ్బందితోపాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. ఇన్ని చేశాం కాబట్టే తాము పట్టభద్రులను ఓట్లు అడుగుతున్నామన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పూర్తి చేశామని, తండాలు, గూడెంలలో టీచర్లను భర్తీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. టాటా కంపెనీతో ఒప్పందం చేసుకుని 65 ఐటీఐలను అడ్వాన్సడ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రే చేశామని, యంగ్ ఇండియా స్కిల్స యూనివర్సిటీని దేశంలో ఎక్కడా లేని విధంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించామని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివరిటీని ప్రారంభించామని వివరించారు. ఇన్ని చేసిన తమకే ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని, కానీ పట్టభద్రులు, రైతులు, ఉద్యోగుల తరఫున శాసన మండలిలో మాట్లాడే వ్యక్తి లేకుండా పోతారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యావేత్త అయిన నరేందర్ రెడ్డిని తమ పార్టీ తరఫున బరిలోకి దించామన్నారు. ఆయన మీకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేస్తారన్నారు.
పట్టభద్రులు, ప్రభుత్వానికి వారధిగా ఉంటా : ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డి
తనను గెలిపిస్తే పట్టభద్రులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియకు ఐదు నెలల ముందు నుంచే తాను ప్రచారం ప్రారంభించానని, ఎక్కడికి వెళ్లినా ఉద్యోగులు, టీచర్లు, ఉద్యోగార్థులు రేవంత్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని, సుమారు పదేళ్ల తరువాత తాము బదిలీలు, ప్రమోషన్లకు నోచుకున్నామని టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పది రోజుల క్రితమే 2008 డీఎస్సీ నియామకాలు, జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానన్నారు. అలాగే ఉర్దూ కళాశాల భవన నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో కళాశాలను అందులోకి షిప్ట్ చేయాలని కోరారు. తనను గెలిపించాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నరేందర్ రెడ్డి అన్నారు.
……………………………………….