
* గ్రామ, మండల ప్రజలకు ఆహ్వానాలు
* ఊరి పంక్తులకు ఏర్పాట్లు
* గాంధీ జయంతితో నాన్ వెజ్ కు కొందరు దూరం
* పిండి వంటలతో పసందైన విందులు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో గ్రామాలు, మండలాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈటల రాజేందర్ వంటి వ్యక్తుల ప్రకటనతో కొందరు సందేహంగా ఉన్నప్పటికీ మెజార్టీ ఆశావహులు ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. మరోపక్క పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎంపీలతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ కూడా ఎన్నికలపై దృష్టి సారించింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేపట్టాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పండుగ సరే.. ఖర్చు భలే..
అధినాయకుల హడావిడితో స్థానిక నేతలు కూడా ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఆశావహులు ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ముందుగా రాజకీయ పార్టీల గుర్తులతో రెండు దశల్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనుండడంతో పోటీకి సిద్ధం అవుతన్నవారంతా టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు. తాను పోటీలో ఉండబోతున్నట్లు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు దసరా, దీపావళి పండుగలను వేదికలుగా మార్చుకుంటున్నారు. కొందరైతే వినాయక చవితి రోజుల్లోనే యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. మండపాల వద్ద ఆటల పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందించారు. అలాగే క్రికెట్ బ్యాట్లు, కిట్లు, కప్పులు వంటి పంపిణీ చేశారు. ఖర్చు మాత్రం తడిసిమోపెడవుతోంది.
మహాత్మ.. మన్నించు..
ప్రభుత్వం అనుకున్నట్లుగానే అంతా ఓకే అయితే.. అక్టోబర్ 9వ తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఈక్రమంలో పండుగలను అనువుగా మార్చుకుని ఆశావహులు, నేతలు ప్రజలతో కలిసే ఏర్పాట్లను చేసుకుంటున్నారు. విందు భోజనాలు, మందు పార్టీల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు దసరానే కొందరు ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పటికే గ్రామస్తులకు, ప్రజలకు ఆహ్వానాలు పంపారు. అయితే.. గాంధీ జయంతి నేపథ్యంలో కొందరు ముక్క భోజనాలు పెట్టేందుకు ఆలోచిస్తుండగా, మరికొందరు సై అంటున్నారు. ఇంట్లోనే వేట వేసేందుకు సిద్ధమయ్యారు. పండుగకు ముందురోజే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. బుధవారం కొన్ని చోట్ల ఆయా దుకాణాలు రద్దీగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇదీ లెక్క..
ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఐదు దశల్లో జరగనున్నాయి. 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులు, 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23న తొలి విడత, 27వ తేదీన మలి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత పోలింగ్ నవంబర్ 4వ తేదీన, మూడో విడత నవంబర్ 8వ తేదీన నిర్వహిస్తామన్నారు. పోలింగ్ పూర్తయిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని వివరించారు. ఎన్నికలన్నీ ముగిసిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు
———————-