* ఒక రోజు ముందు నుంచే ప్రారంభం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ (BRS) ఏర్పాట్లు చేస్తోంది. ఒకరోజు ముందే వేడుకలను ప్రారంభించనుంది. శనివారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం సాయంత్రం హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. అంతకు ముందు గన్‌పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని కేసీఆర్ సందర్శించనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. అలాగే., రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులకు సూచించారు.
ఇదిలా ఉండగా.., తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్.. కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన లేఖను అందించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఆహ్వాన పత్రిక అందజేశామన్న వేణుగోపాల్..ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. కేసీఆర్ హాజరవుతారా, లేదా అనేది ఉత్కంఠగా మారింది.
———————