* తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మన అదృష్టం
* సీఎం రేవంత్రెడ్డి
* తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
* పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
* అందెశ్రీని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గేయ రచయిత అందెశ్రీని సీఎం సన్మానించారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడక, ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న కంకులు తెలంగాణ తల్లి చేతిలో పొందుపరిచారు. సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసముద్రంగా మారాయి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అన్నారు. సోనియా జన్మదినం రోజే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన రోజన్నారు. ఈరోజు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మన అదృష్టమని, తెలంగాణ వారికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి మొదటి ఏడాదిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుందని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. గత పాలకులు కుటుంబం గురించి ఆలోచించారే కానీ యావత్ తెలంగాణ గర్వించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనకు నోచుకోలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లు..
తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము ‘టీఎస్’ను ‘టీజీ’గా మార్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతిచోట ‘జయ జయహే తెలంగాణ’ వినిపించేదని, కానీ రాష్ట్రం వచ్చాక ఆ గేయానికి గౌరవం దక్కలేదని విమర్శించారు. అందుకే తాము ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. తెలంగాణ కోసం గొప్ప కవులు, కళాకారులు కృషి చేశారని, వారిని సన్మానించుకోవడం మన బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. వారిలో గూడా అంజయ్య, గద్దరన్న, బండి యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పాశం యాదగిరి, యాదగిరి రావులకు ఫ్యూచర్స్ సిటీలో 300 గజాల స్థలము, ప్రభుత్వం నుండి కోటి రూపాయల ఆర్థిక సాయం, తామర పత్రాన్ని కూడా అందజేస్తున్నట్లు సీఎం బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చేందుకు అంతా కలిసి పోరాడామని, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలకు ఎంతగానో స్వేచ్ఛ లభించిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించామని, అలాగే రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు రూ.64 వేలకోట్ల వడ్డీ చెల్లించామని, ఇకపై ప్రతిఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు. ఇప్పటివరకు ఎవరూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదని, తొలిసారి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రజలను ఆకట్టుకుంది.
………………………………………..