
* దామోదరను మంత్రివర్గం నుంచి తప్పించాలి
* ఆయన స్థానంలో ఇద్దరు మాదిగలకు స్థానం కల్పించాలి
* మంత్రులుగా నలుగురు రెడ్లున్నారు.. ఇద్దరు మాదిగలు ఉంటే తప్పేంటి?
* మా రిజర్వేషన్లు మాగ్గావాలె
* ఏ ప్రాతిపదిక చూసినా 11 శాతం రావాలి
* ప్రభుత్వ లెక్కల ప్రకారం మాకు 2 శాతం తక్కువ వచ్చాయి
* మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఏ ప్రాతిపదిక చూసినా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు దక్కాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (MandaKrishna Madiga) డిమాండ్ చేశారు. మాదిగల జనాభాకు తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్(Hyderabad PrssClub)లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 32 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్లు రావాలని తెలిపారు. కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన దాంట్లో తమకు 9 శాతమే దక్కుతుందన్నారు. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారని ఆగ్రహం చేశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలని తెలిపారు. మాకు రావాల్సిన రిజర్వేషన్ల కంటే 2 శాతం తక్కువ వచ్చాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడామని మందకృష్ణ మాదిగ చెప్పారు. చాలా కమీషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని చెప్పారు. మాదిగల జనాభా తగ్గట్లుగానే రిజర్వేషన్ల వాటా ఉండాలని విన్నవించామని చెప్పారు. పంబాల కులం (Pambala Caste)గతంలో అడ్వాన్స్డ్ కేటగిరిలో ఉండేదని, ఇప్పుడు తక్కువ కేటగిరీలో ఎలా చేర్చారని ప్రశ్నించారు. వర్గీకరణలో మాదిగల రిజర్వేషన్ ను తగ్గడం ఖండిస్తున్నామన్నారు.
లక్ష డప్పులు వాయిదా
7న తలపెట్టిన లక్ష డప్పుల కార్యక్రమం వాయిదా వేస్తున్నామన్నారు. 15 రోజుల తర్వాత సాంస్కృతిక మహోత్సవంగా నిర్వహిస్తామన్నారు. మాదిగలకు వాటా రాబట్టడంలో మంత్రి దామోదర రాజనర్సింహ విఫలమయ్యారని ఆరోపించారు. దామోదరను మాదిగల ప్రతినిధిగా చూడట్లేదన్నారు. దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha)ఎవరి ప్రతినిధో చెప్పాలన్నారు. మంత్రివర్గ విస్తరణలో దామోదరను తప్పించాలన్నారు. దామోదర స్థానంలో ఇద్దరు మాదిగలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రులుగా నలుగురు రెడ్లు ఉన్నారని, ఇద్దరు మాదిగలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.
…………………………