* 30 మంది విద్యార్థులను రక్షించిన అధికారులు
* భారీ వర్షాలతో విషాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ వర్షాలు రాజధాని ఢిల్లీలో విషాదాన్ని నింపాయి. అనూహ్య ముంపుతో సివిల్స్ కు ప్రిపేరవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు పోటెత్తింది. అక్కడి గ్రంథాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు నీళ్లలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 30 మందిని రక్షించగా, మరో ముగ్గురు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవిన్ డాల్విన్ (28)గా గుర్తించినట్లు అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ఈ దుర్ఘటనపై క్రిమినల్ కేసు నమోదుచేశామని, ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని సీనియర్ పోలీస్ అధికారి హర్షవర్ధన్ చెప్పారు. ఫోరెన్సిక్ ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.
——————–