* ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లోజ్…
* కవితకు కోర్టు ‘క్లీన్ చిట్’
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (లిక్కర్ స్కామ్) కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ విజయం లభించింది. ఈ కేసులో కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా మొత్తం 23 మంది నిందితులను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి జితేంద్ర సింగ్, దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సమర్పించిన ఆధారాలు కేవలం ఊహలపై ఆధారపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి నేరపూరిత కుట్రగానీ, అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పక్కా ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించడంలో సీబీఐ విఫలమైందని, కేవలం రాజకీయ ప్రేరేపిత ఆరోపణలతో కేసును నిర్మించడం సరికాదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు నిందితులందరినీ కేసు నుండి డిశ్చార్జ్ చేస్తూ, వారిపై ఉన్న అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
“సత్యమే జయించింది”: కవిత భావోద్వేగ స్పందన!!
తీర్పు వెలువడిన అనంతరం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “చీకటి రోజులు ముగిశాయి, న్యాయం గెలిచింది” అని ఆమె పేర్కొన్నారు.
“గడిచిన రెండేళ్లుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు జరిగాయి. కుటుంబాన్ని, పార్టీని ఇబ్బందులకు గురిచేశారు. కానీ న్యాయవ్యవస్థపై నాకు మొదటి నుండి నమ్మకం ఉంది. సత్యమే జయించింది. ఈ తీర్పు కేవలం నా ఒక్కదాని విజయం కాదు, ప్రజాస్వామ్య విజయం,” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. ముఖ్యంగా కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ‘క్లీన్ చిట్’ ఆమెకు మాస్టర్ స్ట్రోక్‌లా మారింది. ఇన్నాళ్లూ ‘లిక్కర్ స్కామ్’ ఆరోపణలతో డిఫెన్స్‌లో ఉన్న కవిత, ఇప్పుడు విమర్శకుల నోళ్లు మూయించే అవకాశం దక్కింది.
కొత్త పార్టీ దిశగా అడుగులు
మే నెలలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు కవిత సిద్ధమవుతున్నారు. ఈ క్లీన్ చిట్ ఆమె ఇమేజ్ను ప్రజల్లో పెంచడమే కాకుండా, క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపనుంది. ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ: ఈ కేసును అస్త్రంగా చేసుకుని ఇన్నాళ్లూ దాడి చేసిన కాంగ్రెస్, బీజేపీలకు కోర్టు తీర్పు ఊపిరి ఆడనివ్వని పరిస్థితి కల్పించింది. లిక్కర్ స్కామ్ కథ సుఖాంతం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కవిత తదుపరి అడుగుపైనే ఉంది. ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ఎలా మలుచుకుంటారు? మే నెలలో ఆమె ప్రకటించబోయే పార్టీ అజెండా ఏమిటి? అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

1 thought on “KALVAKUNTLA KAVITHA | కోర్టు సంచలన తీర్పు”