* రు. 22 కోట్ల 10 లక్షలతో చేపట్టిన పలు రోడ్డు నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన
ఆకేరున్యూస్, ఖమ్మం: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించి సి.ఆర్.ఆర్. నిధులు సుమారు 22 కోట్ల 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, ఆఫీస్, స్టోర్ రూం భవనాన్ని ప్రారంభించారు. ముందుగా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో నాగిలిగొండ నుండి కొండవనమాల వరకు 4 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, నాగిలిగొండ నుండి గొల్లెనపాడు వరకు 7 కోట్ల 10 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం, ఆఫీస్, స్టోర్ రూం భవనాన్ని ప్రారంభోత్సవం చేసారు.
అలాగే జగన్నాధపురం లో వేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి రేపల్లేవాడ వరకు ఒక కోటి రూపాయలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి జగన్నాధపురం వరకు ఒక కోటి రూపాయలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు, పందిళ్లపల్లిలో పందిళ్లపల్లి నుండి మత్కే పల్లి వరకు 8 కోట్ల 50 లక్షలతో చేపట్టిన బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రజల కోసం ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తన్నామని, చాలా రోజుల తర్వాత పేద విద్యార్థుల గురించి ఆలోచించి కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి నిమిషం చాలా విలువైందని, ఒక నిమిషం కూడా వృధా చేయకుండా ఉరుకులు, పరుగులతో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలియజేశారు.
…………………………………………….