![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/9410ade8-5c5d-4c72-bd9a-f9b8ef0d512d-1024x709.jpg)
* మండల సాధనలో రెండవ రోజు మహాధర్నా రాస్తారోకో
* ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు
* అన్ని రకాలుగా సౌలభ్యం ఉన్న మండల ఏర్పాటు చెయ్యదలేదని ఆవేదన వ్యక్తం చేసిన మండల సాధన జేఏసీ
* మండలాన్ని ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం అవుతుందంటున్న ప్రజలు
ఆకేరు న్యూస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీని మండలం చేయాలని మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై గురువారం ఉదయం రాస్తారోకో చేశారు. ఆదాయపరంగా, వనరులపరంగా, అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఉప్పల్ ను మండలంగా ఎందుకు ప్రకటిస్తలేరు అని మండల జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మా గ్రామాన్ని మండలంగా ప్రకటించే వరకు కూడా విశ్రమించేది లేదని , పోరాటాలు తమ గ్రామానికి కొత్త కాదని, రోజురోజుకు మండల సాధన కోసం ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. అనంతరం కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ పోలీసు బృందంతో విచ్చేసి, ఆందోళన చేస్తున్న వారిని శాంతింపచేసి, ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
మండలంగా ప్రకటించబోతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం..
– రాబోయే ఎన్నికలను సైతం బహిష్కరిస్తాం
– ఎర్రబెల్లి సంపత్ రావు
మండల సాధన జేఏసీ సభ్యుడు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా అన్ని రకాలుగా సదుపాయాలున్న ఉప్పల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించటంలేదని, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని, పార్టీలకతీతంగా ప్రజలందరూ ఏక తాటిపైకి వచ్చి, మండలాన్ని కోరుకుంటున్నారని మండల సాధన జేఏసీ సభ్యుడు ఎర్రబెల్లి సంపత్ రావు అన్నారు. ప్రజలందరి అభీష్టం మేరకు చుట్టుపక్కల 9 గ్రామాలను కలుపుకుంటూ మండలాన్ని ప్రకటించాలని లేనిచో ఆమరణ నిరాహారదీక్షకైనా సిద్ధపడతామని , రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు.
సోర్స్, రిసోర్స్పరంగా ఉప్పల్‌ను మండలం చేయాలి
-ఎర్రబెల్లి దేవేందర్ రావు, మండల సాధన జేఏసీ సభ్యుడు
చుట్టుపక్కల గ్రామాలను కలుపుకుంటూ మెరుగైన రవాణా సదుపాయాలు ఉన్నాయని, విద్య, వైద్యం,వ్యవసాయానికి సంబంధించి, అంతేకాకుండా మండలం ఏర్పాటైన తర్వాత కూడా ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పటానికి సరిపోను ఐదు ఎకరాల భూమి ఉందని కచ్చితంగా మండల కేంద్రంను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, సంబంధిత మంత్రులను కోరుతున్నామన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తమకు మండలాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండల ఏర్పాటుకి స్పందిస్తున్నాడని, ఆయన తరుపున మండల ఏర్పాటు చేయమని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారని అన్నారు.
మండలాన్ని వెంటనే ప్రకటించాలి..
– రాణా ప్రతాప్, స్టూడెంట్ జేఏసీ సభ్యుడు
ఉప్పల్ గ్రామంలో అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, కేవలం పోలీస్ స్టేషన్ , ఎమ్మార్వో ఆఫీస్ తప్ప మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉప్పల్‌లో ఉన్నాయని, వెంటనే ఉప్పల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని లేనిపక్షంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా నిర్వహించిన రైలురోకోను మళ్లీ నిర్వహించడానికి కూడా వెనుకాడబోమని మండల సాధన స్టూడెంట్ జేఏసి సభ్యుడు రానా ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సాధన సమితి సభ్యులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఎర్రబెల్లి దేవేందర్ రావు, ముజీబ్ హుస్సేన్, ఖాజ హస్నొద్దీన్, రాజమౌళి,మాజీ సర్పంచ్ ర్యాకం మొండయ్య,తోట సురేష్, తూర్పాటి క్రాంతి, కొనుపుల రామచందర్, మహారాజు స్వామి , శ్రీధర్ రావు, శ్రీనివాస్ రావు, రాజమౌళి, రాణా ప్రతాప్,మేడిపల్లి రాజు, తూర్పాటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..