* లిఫ్ట్ చేస్తే అందమైన అమ్మాయి హాయ్ అంటోందా?
* వెంటనే కట్ చేయండి..
* అందమైన అమ్మాయని మాట కలిపారా అంతే..
* ఇప్పటికే 200 కోట్లకు పైగా దోచేశారు..
ఆకేరు న్యూస్ డెస్క్ : ఫోన్ చూస్తుండగా అకస్మాత్తుగా వాట్సప్ వీడియో కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే షాక్.. అందమైన ఓ అమ్మాయి హాయ్.. అంటూ అంతకంటే అందంగా పలకరిస్తుంది. తన అందచందాలతో మురిపిస్తుంది. అవతలివ్యక్తిని మైమరిపించేలా చేస్తుంది. అలా అలా గమ్మత్తుగా మాట్లాడుతూ, తన అందాలను మరింత ఒలకబోస్తూ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడేలా చేస్తుంది. ఆమె మోజులో.. అందాల మత్తులో పడ్డారా అంతే సంగతులు. ఎనలేని మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఆ మూడింటితో ముప్పు
ఇప్పుడంతా సైబర్ నేరాల కాలం. సాధారణ నేరాల కంటే రెట్టింపు సంఖ్యలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో అదేస్థాయిలో ఆందోళనా కలిగిస్తోంది. ఏ ఫోన్ లిఫ్ట్ చేయాలన్నా భయం. ఏ లింక్ క్లిక్ చేయాలన్నా భయమే. అందుకు కారణం రోజురోజుకూ సైబర్ నేరాలు అధికమవుతుండడమే. ఎక్కడో ఉండి చిన్న ల్యాప్‌టాప్ ముందరేసుకుని, ఫోన్ పట్టుకుని సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలను కొట్టేస్తున్నారు. ఈ తరహా నేరాల్లో న్యూడ్ వీడియో కాల్స్, విదేశాల్లో అరెస్ట్, ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ పేరుతో బెదిరింపులు ఎక్కువగా ఉంటున్నాయి.
రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు
గిఫ్ట్ కూపన్లు అంటూ లింక్‌లు పంపి ఖాతాలు కొట్టేయడం, మాయమాటలతో యాప్‌లు ఇన్స్టాల్ చేయించి డబ్బు దోచేయడం, రెట్టింపు లాభమని పెట్టుబడులు పెట్టించి మోసం చేయడం వంటి నేరాలపై పౌరులు అవగాహన పెంచుకున్నారు. జాగ్రత్త పడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు కూడా రూట్ మార్చుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇప్పుడు కేసులు, అరెస్టులు, డ్రగ్స్ అంటూ భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి.. వలలో పడ్డవారు న్యూడ్‌గా ఉన్న సమయంలో రికార్డు చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. న్యూడ్ వీడియోలు, ఫొటోలను సన్నిహితులకు పంపిస్తామని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఏకంగా రూ. 200 కోట్లు
హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్ చేసిన ఓ మహిళ.. అతడిని ముగ్గులోకి దింపింది. అతడు కూడా న్యూడ్‌గా కాల్ మాట్లాడేలా చేసింది. ఆ తర్వాత వీడియో రికార్డు చేసి బెదిరించడం మొదలుపెట్టింది. సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు తలొగ్గి ఆ వృద్ధుడు దఫదఫాలుగా రూ. 20 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అలాగే, నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడికి గుర్తుతెలియని నంబర్ నుంచి స్కైప్ కాల్ వచ్చింది. ఈడీ అధికారినని పరిచయం చేసుకున్న అతడు మీ ఖాతాల ద్వారా డబ్బు విదేశాల్లో ఉంటున్న నేరస్తులకు వెళ్లిందని.. దానికి సంబంధించి కేసులు నమోదయ్యాయని చెప్పి భయపెట్టాడు. కేసు నుంచి తప్పిస్తానంటూ పలు దఫాలుగా రూ. 40 లక్షలు కాజేశాడు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ తరహాలో ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు రూ. 200 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ తరహా సంఘటనలు ఎదురైనప్పుడు వెంటనే 1930కి కాల్ చేయాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
…………………………………..