
* కలవర పెడుతున్న కలుషిత ఆహార ఘటనలు
* గురుకులాలు, పాఠశాలల్లో తరచూ సమస్యలు
* ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థులు
* తాజాగా.. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ మోడల్ స్కూల్లో..
* పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విపక్షాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో కలుషిత ఆహారం బారిన పడి అస్వస్థతకు గురవుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కు గురై చాలా మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈతరహా ఘటనలు జరిగినప్పుడల్లా తల్లిదండ్రులు ఉలిక్కిపడుతున్నారు. ఊళ్లల్లో ఉంటున్న వారు ఉరుకులు.. పరుగులు పెడుతూ పాఠశాలలు, ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. తమ బిడ్డలకు ఏమైందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా ఘటనలు పెరుగుతుండడంపై విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఇంకెంత మంది విద్యార్థులు ఇబ్బందులు పడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
కొద్ది రోజుల తేడాలోనే..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థిని తరుణి, ఆరో తరగతి బాలికలు అలకనంద, రేవతి అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. నాగల్ గిద్ద మండలం మొర్గి గ్రామంలోని పాఠశాలలో రాత్రి డిన్నర్ లో 60 మంది విద్యార్థులు చికెన్ తిన్నారు. ఉదయానికి చాలా మంది వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ విద్యార్థులు అందరూ నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. రోజుల తరహాలోనే రెండు ఘటనలు జరగడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా..
తెలంగాణలోని మంచిర్యాల, భద్రాచలం, నాగర్ కర్నూల్, సంగారెడ్డి జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేక సార్లు వెలుగుచూశాయి. పురుగుల అన్నం, కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో ఆహారం నాణ్యత లేక విద్యార్థులు తరచూ ఆందోళనలు చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో విద్యార్థినులు నాసిరకం భోజనంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి ఎదుటే కన్నీళ్లు గతంలో పెట్టుకున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారయింది. ఆహారం బాగోలేదంటూ వారంలో రెండు రోజులు ఏదో ఒక పాఠశాలలో నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి. పురుగుల పట్టిన అన్నం తిని ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రులలో కూడా జాయిన్ అవుతున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటుందని, శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
………………………………………………..