* చిన్న వయసులోనే హృదయ సంబంధ వ్యాధులకు గురవుతున్న యువత
* ఇప్పటికే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు అదుపు చేయవచ్చు..
* ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ పద్ధతులు పాటించాలి
ఆకేరు న్యూస్, వరంగల్ : నేటి సమాజంలో చిన్నవయస్సులోనే 20 నుంచి 30ఏళ్లలోపు వారు కూడా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. గుండెపోటు బారినపడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆహారంతో పాటు వ్యాయామం అవసరమని గుండె సంబంధిత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ జీ.మల్లికార్జున్ రావు (ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, కార్డియాలజీ) చెబుతున్నారు.
మన శరీర ఆరోగ్యంతో పాటు మన గుండె ఆరోగ్యం కూడా మనం తీసుకునే ఆహారం మీద ఆధార పడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడేలాగా ఉండాలి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం కోసం కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తినాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాయామం తప్పనిసరి. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంతో పాటు, శరీరానికి అవసరమయ్యే నిద్ర, వ్యాయామం, పొగ తాగడం, మద్యం సేవించడం వంటివి కూడా ఆరోగ్యంపై ప్రభావితం చూపుతాయి. కాబట్టి మన ఆరోగ్యానికి ఏం కావాలి అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఒక రోగం మనకు రాకుండా ఉండేందుకు మనల్ని మనం కాపాడుకునే ప్రక్రియను ప్రివెన్షన్ అంటాం. ఇప్పటికే బీపీ, షుగర్, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్లు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే.. రోజుకు కనీసం 30 నిమిషాలు.. వారంలో ఐదు రోజులు వాకింగ్, లేదా ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. మన వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చు. అలాగే, దీంతో పాటు మనం తీసుకునే ఆహారం (డైట్) ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా తీసుకునే ఆహారంలో నూనె, ఉప్పు తగ్గించాలి. కూరగాయలను సామాన్యంగా మన ఇళ్లలో రెండు రకాలుగా వండుతారు. ఒకటి వేపుడు, రెండోది ఉడికించి తినడం. వేపుళ్లు తీసుకోక పోవడం వల్ల మన శరీరానికి ఉప్పు, నూనె తక్కువగా అందుతుంది. పళ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. ఉప్పు, నూనె తక్కువ తీసుకోవాలి. బయట లభించే ఆహారం, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు తగ్గించాలి. మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయడం వల్ల గుండెపోటును చాలా వరకు నియంత్రించవచ్చు.
జీవన విధానం..
పొగ తాగడం, మద్యం సేవించడం వంటివి చేసే వారిలో గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పొగ తాగడం వల్ల పొగాకుతో పాటు క్యాన్సర్ కారకాలు శరీరంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాగు పొగాకు నమలడం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
పాసివ్ స్మోకింగ్ : పొగ తాగే వారికి మీటర్ దూరంలో ఉంటే మనం కూడా వారితో పాటు పొగతాగినట్లే దీనినే పాసివ్ స్మోకింగ్ అంటారు. యువతకు దీనిపై కూడా అవగాహన కల్పించాలి. సిగరెట్ తాగే వ్యక్తికి ఎంత రిస్క్ ఉందో అతని పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా అంతే రిస్క్ ఉంటుంది.
ఆల్కహాల్ సేవించడం వల్ల..
ఆల్కహాల్ తీసుకున్న వెంటనే మనిషికి బీపీ పెరగడం మొదలవుతుంది. 120|80 ఉన్న బీపీ కాస్త 140|90కి పెరుగుతుంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇన్ డైరెక్ట్ గా డీ హైడ్రేషన్‌కి గురవడం, షుగర్ కంట్రోల్ లో లేకపోవడం, శరీరంలోకి ప్రమాదకర యాక్సిడెంట్స్ కారకాలు వెళ్తాయి. దీంతోపాటు ఆల్కహాల్ తీసుకునే సమయంలో పొగాకు నమలడం, పొగ త్రాగడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరుగుతుంది.
గుండె సంబంధిత వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే వెజ్, నాన్ వెజ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణంలో లభించే బిర్యానీ వంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు. అలాగే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జా, బర్లర్లకు దూరంగా ఉండాలి.
పండ్లు – కూరగాయలు..
ప్రతి రోజూ పండ్లు కూరగాయలను ఎక్కువగా తినాలి. రోజూ ఫ్రెష్ లేదా ఫ్రోజెన్ బ్లూబెర్రీలు తినడం చాలా అవసరం. పాలకూరను కూడా మన డైట్ లో చేర్చుకోవాలి. పాలకూరతో పప్పు లేదా కూర నచ్చని వారు సలాడ్‌గా అయినా తినాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలతో ఎక్కువగా వేయించవద్దు. పండ్లు, కూరగాయలు అధికంగా ఉన్న ఆహారం గుండె వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉప్పు, నూనెలు తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.
డ్రై ఫ్రూట్స్..
ప్రతిరోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ తినాలి. వాల్నట్స్, బాదం పప్పలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కప్పు నిండా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఒక మంచి స్నాక్ లాగా కూడా ఉపయోగపడతాయి. ఎక్కువగా ఖాజూ, బాదాం, పిస్తా, వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల గుండె వ్యాధి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వ్యాయామం తప్పనిసరి..
రోజుకు కనీసం 30 నిమిషాలు.. వారంలో ఐదు రోజులు వాకింగ్, లేదా ఎక్సర్సైజ్ చేయడం తప్పనిసరి. వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చు. ఉదయం లేదా సాయంత్రం వేళ సైక్లింగ్ చేయడం లేదా అందుబాటులో ఉన్న మైదానాల్లో కేవలం 30 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది.