* అమెరికాలో చిన్న పిల్లల ఆస్పత్రికి విరాళం
* తల్లి దండ్రుల వివాహ వార్షికోత్సవం సంధర్భంగా కుమారుడి ప్రకటన
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : అపర దాన కర్ణుడు .. తన కోసం సమాజం కోసం ఆలోచించే మహానుభావుడు.. సమాజం మనకేమి ఇచ్చిందని కాదు.. మనం సమాజానికేం ఇచ్చామన్నదే అసలైన విషయమని ప్రపంచమంతా కీర్తిస్తున్నారు . అన్నిటి కి మించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ( Dr Baba Saheb Ambedkar ) చెప్పినట్లు సమాజానికి తిరిగి చెల్లించాలన్న మాటలను అక్షరాల అమలు పరచిన వ్యక్తి డాక్టర్ పగిడిపాటి దేవయ్య. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా బే ( Tampa bay ) ప్రాంతంలో డాక్టర్ పగిడిపాటి దేవయ్య , డాక్టర్ రుద్రమ దేవి ల కుటుంబం నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో ఉన్న సేయింట్ జోషఫ్ పిల్లల ఆస్పత్రి ( St. Joseph’s Children’s Hospital ) కి చారిత్రాత్మక విరాళం అందజేశారు. ఏకంగా అమెరికా డాలర్లలో 50 మిలియన్ డాలర్లు, ఇండియా కరెన్సీ ప్రకారం రూ. 420 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ పగిడిపాటి దేవయ్య కుమారుడు సిద్దార్థ పగిడిపాటి ( Siddu Pagidipati ) ఈ విరాళం ప్రకటించారు. తన తండ్రి 50 ఏళ్ళ క్రితం అమెరికాకు కేవలం 8 డాలర్లతో వచ్చాడన్నారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారన్నారు. తల్లి దండ్రుల 50 వ వివాహ వార్షికోత్స వ సంధర్భంగా 50 మిలియన్ డాలర్ల విరాళం ఆస్పత్రికి అందజేస్తున్నామన్నారు. దీంతో పిల్లల వైద్యం కోసం ఇదే ఆవరణలో పగిడిపాటి పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తారని సిద్దార్థ వివరించారు. ఈ విరాళం గురించి తెలిసి దేశ, విదేశాల నుంచి ప్రజలు పగిడిపాటి కుటుంబాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
* ఎవరీ డాక్టర్ పగిడిపాటి దేవయ్య ..?
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇపుడు జనగామ జిల్లా ఖిలా షాపురానికి చెందినవాడు. డాక్టర్ పగిడిపాటి దేవయ్య నిరుపేద మాదిగ కుటుంబంలో పుట్టి ఉన్నత వైద్య విద్యను అభ్యసించాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రుద్రమ దేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత 50 ఏళ్ళుగా అమెరికాలో స్థిర పడ్డారు. ఎంపీగా , ఎమ్మెల్యేగా గెలిచి వరంగల్‌ను ఎంతో అభివృద్ధి చేద్దామని ఆశపడ్డాడు. అందుకోసం పకడ్భందీ ప్రణాళిక రూపొందించారు. ప్రొఫెసర్ కోదండ రాం నాయకత్వంలోని తెలంగాణ జనసమితి వర్థన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
* అంబేద్కర్ చెప్పారు.. నేను ఆచరించాను.
– డాక్టర్ పగిడిపాటి దేవయ్య
ఎన్నో కష్టాలు, వివక్ష ఎదుర్కొని ప్రపంచ మేధావిగా డాక్టర్ బాబాసాహెబ్ నిలబడ్డాడు. ఆయన బాటలోనే నేను నడిచాను. మాటల్లో కాదు.. చేతల్లో .. అతి బీదరికంతో అమెరికాలో అడుగుపెట్టాను. కష్టపడ్డాను. నిరంతరం శ్రమించాను. ఆకేరు న్యూస్ ప్రతినిధితో అమెరికా నుంచి ఫోన్లో మాట్లాడారు. సమాజంలో కొన్ని వర్గాలు మాత్రమే ఉన్నత స్థాయికి చేరుతారన్న అపొహను పోగొట్టాను. దళిత సామాజికవర్గాల నుంచి కూడా అవకాశాలు లభిస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారని నిరూపించాను. ఇపుడు ఎంతో విలువైన సంపద ఉంది. సొంత విమానాలు ఉన్నాయి. ఇవి మాత్రమే మనిషికి, మనసుకు సంతృప్తి నివ్వవు. మన వల్ల సమాజానికి మేలు జరుగుతుందనిపిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకే నా కుటుంబం సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆస్పత్రికి రూ. 420 కోట్లు విరాళంగా ఇచ్చాము. ఇపుడు ఎంతో తృప్తిగా ఉంది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగానే నేను సంపాదించిన దాంట్లో ( Pay back to the Society ) సమాజానికి కొంత తిరిగి చెల్లించాను.. ఇండియాలో ఇప్పటికే దాదాపు 400 మంది విద్యార్థులను చదివిస్తున్నాను. ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవసరమైన ఫీజులు, పుస్తకాలు,కంప్యూటర్లు. ఇతర విద్యకు ఉపయోగపడే అవసరాల కోసం డబ్బులు ఇస్తున్నాను. ఆ విద్యార్థి జీవితంలో స్థిరపడిన తర్వాత తిరిగి మరో పేద విద్యార్థిని చదివించాలన్న షరతు మీదే వారికి ఆర్థిక సాయం చేస్తున్నాను. హైదరాబాద్, వరంగల్ లో ఉపాధి అవకాశాలు మెరుగుపరాచాలన్న లక్ష్యంతో సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నాను. ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.. సమయం వచ్చినప్పడు వాటి గురించి చెబుతానని డాక్టర్ దేవయ్య అన్నారు.
————————————————-
–