ఈ కామర్స్ సంస్థల్లో ప్రమాణాలు అంతంతే
– ప్యాకింగ్‌లో ఆకర్షణ.. నిర్వహణ అధ్వానం
– తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ

ఇప్పుడంతా ఆన్లైన్ యుగం నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో కావాల్సిన ఆహారపదార్థాలు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. వేడివేడిగా, ఆకర్షణీయమైన ప్యాక్‌లలో కళ్లముందు ఉంటున్నాయి. సమయం లేని సంసారాలు పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈగలు వాలిన ఆహార పదార్థాలు, బొద్దింకలు తిరుగుతున్న వాతావరణం, ఆహారంలోనూ క్రిమికీటకాలు వెలుగుచూసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లోను, పౌరుల ఫిర్యాదుల సమయాల్లోనూ ఇలాంటివి బయటపడుతున్నాయి. మరి ఆన్లైన్లో ఇస్తున్న ఆర్డర్ల పరిస్థితి ఏంటి? ఈ కామర్స్ సంస్థల నుంచి మన ఇంటికి వస్తున్న సరుకులు సురక్షితమేనా?, నిర్వహణలోను, ప్యాకింగ్లోను పరిశుభ్రత పాటిస్తున్నారా..? అంటే కష్టమేనని జీహెచ్ఎంసీ ఆకస్మిక తనిఖీల్లో బయటపడింది.
బొద్దింకలు.. ఇతర క్రిమికీటకాలు..
మహానగరంలోని ఫుడ్ విక్రయ సంస్థల్లో తరచూ తనిఖీలు చేపట్టే జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఈ-కామర్స్ సంస్థలకు చెందిన నిల్వ, పంపిణీ కేంద్రాలు, డెలివరీ పాయింట్లలోనూ ఆకస్మిక తనిఖీలు మొదలుపెట్టారు. కమిషనర్ కర్ణన్ ఆదేశాలతో సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిల్వ, పంపిణీ కేంద్రాల్లో సరుకులపై ఈగలు వాలడాన్ని సిబ్బంది గుర్తించారు. నిల్వ కేంద్రాల్లో బొద్దింకలు తిరుగుతున్నాయి. బొద్దింకలు, ఇతర క్రిమికీటకాల నివారణకూ కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్లను ప్యాక్ చేసే స్టోర్ సిబ్బంది హెయిర్ క్యాప్‌లు, గ్లోవ్స్ వాడడం లేదు.
కుళ్లినవి.. నాణ్యతారహితమైనవి..
ఆన్లైన్ ఆర్డర్లపై నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు సరఫరా చేసే కొన్ని సంస్థలు ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రజారోగ్యం పట్ల కనీస జాగ్రత్త తీసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నిత్యావసర సరుకుల్లో కాలం చెల్లినవి, కుళ్లినవి, నాణ్యతా రహితమైనవి సరఫరా చేస్తున్నారన్న జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు ఇటీవల ఎక్కువయ్యాయి. కొన్ని రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్రఽధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఫుడ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఛైర్మన్ ఢిల్లీలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కామర్స్ సంస్థ ద్వారా ఆర్డర్ చేస్తే బూజు పట్టిన బ్రెడ్డు పంపారని పేర్కొన్నారు.
వామ్మో.. ఆన్లైన్ ఆర్డర్!
మహానగరంలోని పౌరులు ఫిర్యాదులు, ఛైర్మన్ ఆదేశాల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. గురువారం పలు ప్రాంతాల్లో 35 కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులు 65 నమూనాలు సేకరించిన పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ఆహార, ఆహారేతర వస్తువులు ఒకే చోట నిల్వ చేశారని తనిఖీ సమయంలో అధికారులు గుర్తించారు. దీంతో మరిన్ని కేంద్రాల్లో తనిఖీలకు సిద్ధం అవుతున్నారు. ఆన్లైన్ సరుకుల నిల్వ, పంపిణీ కేంద్రాల్లోని అపరిశుభ్ర వాతావరణం గురించి తెలుసుకుంటున్న కొందరు వినియోగదారులు వామ్మో.. ఆన్లైన్ ఆర్డర్ అంటున్నారు.