* బయటకు పరుగులు తీసిన జనం
* ప్రమాదం లేదన్న అధికారులు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : మొంథా తుపాను అలజడితో అల్లాడిన ఆంధ్రప్రదేశ్.. ఈరోజు భూప్రకంపనలతో ఉలిక్కిపడింది. విశాఖపట్నం(Visakhapatnam), అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju) జిల్లాల్లో ఈరోజు భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు.. పది కిలోమీటర్ల లోతు నుంచి వచ్చాయని అధికారులు తెలిపారు. హఠాత్తుగా ప్రకంపనలతో జనం బయటకు పరుగులు తీశారు. విశాఖ జిల్లాలోని గోపాలపట్నం, ఎంవీపీ కాలనీ, మురళీ నగర్, భీమిలి, పెందుర్తి, ఆరిలోవ, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ(Hb Colony), అల్లిపురం, రిషికొండ, అడవివరం, ఎండాడలో ప్రకంపనలు వచ్చినట్లు చెబుతున్నారు. తెల్లవారుజామున 4.16 గంటలకు స్వల్ప భూప్రకంపనలు తీవ్రత కనిపించిందని స్థానికులు పేర్కొంటున్నారు. అంతేకాదు అటు సింహాచలం(Simhachalam)లో కూడా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయని చెబుతున్నారు. అధికారిక ధృవీకరణ కోసం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) పరిశీలన చేసి విశాఖలో తీవ్రత 3.7గా ఉందని తేల్చింది. ప్రమాదం ఏం లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.
………………………………………………
