రేవంత్ రెడ్డిని నిలదీసే సమయం ఆసన్నమైంది.
* రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి చేయాలి.
* ఒడ్డెక్క దాకా ఓడ మల్లప్ప… ఒడ్డు దిగాక బోడమల్లప్ప
ఆకేరు న్యూస్ , కమలాపూర్ :
హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామా నడుపుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా సమస్యల మీద రేవంత్ రెడ్డిని నిలదీసే సమయం ఆసన్నమైందని రాజేందర్ అన్నారు. బీజేపీ తరఫున మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన తర్వాత మొదటిసారిగా ఈటెల రాజేందర్ మంగళవారం రోజు తన సొంత మండలం కమలాపూర్ విచ్చేశారు. కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రతి గ్రామంలో కూడా 40% మాత్రమే రైతు రుణమాఫీ అయిందన్నారు.ఎన్నికల ముందు 65 లక్షల మంది రైతులు ఉంటే 48 వేల కోట్లు రుణమాఫీకి ఖర్చవుతుందనీ చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత 45 లక్షల మంది రైతులు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నాడన్నారు. రూ. 34 వేల కోట్ల రూపాయలు సరిపోతుందని, చివరిగా 31 వేల కోట్ల రూపాయలని తేల్చి 17 వేల కోట్లు ఇప్పటివరకు ఇచ్చారన్నారు. రుణమాఫీపై గ్రామాలలో చర్చ జరగకుండా హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి డ్రామా నడుపుతున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు.
రేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా..
ఏ నిబంధనలు లేకుండా, రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఒక్కో కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్ర నేతలైన సోనియా గాంధీ ,రాహుల్ గాంధీల సమక్షంలో ప్రగల్భాలు పలికారన్నారు. ప్రజలను నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు విస్మరించి, ప్రజల సమస్యలను గాలికి వదిలేసారని ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి కుటుంబానికి సంబంధించి మాత్రమే రెండు లక్షల రుణ మాఫీ జరిగిందని, కానీ ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన రుణమాఫీ జరగలేదని ఆయన అన్నారు.. మహిళలు, వికలాంగులకు పెంచిన పింఛన్ ఎప్పటిలోగా ఇస్తారో, అదేవిధంగా కొత్త దరఖాస్తులను స్వీకరించి కొత్త పింఛన్ల పంపిణీ ఎప్పటిలోగా చేపడతారనేది స్పష్టత లేదని ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో రెండవ విడత దళిత బంధు విడుదల చేయకుండా…దళితులను మోసం చేసిన పార్టీగా టిఆర్ఎస్ పార్టీ మిగిలిపోయిందన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును పూర్తిస్థాయిలో అందరికీ అందజేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టి బిజెపి పార్టీని అజేయమైన ప్రజాశక్తి గల పార్టీగా రూపాంతరం చెయ్యాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీజేపీ పరకాల ఇన్చార్జి కాళీ ప్రసాద్ రావు, జమ్మికుంట మాజీ జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్,బిజెపి మండల అధ్యక్షుడు కట్కూరి అశోక్ రెడ్డి,పల్లె వెంకటరెడ్డి , వలిగే సాంబారావు,బండి సంపత్, పార్టీ శ్రేణులు, బిజెపి యువమోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
————————