హర్యానా సంప్రదాయ వేషధారణలో విద్యార్థుల సందడి
* ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ
* హర్యానా సంప్రదాయ వేషధారణలో విద్యార్థుల సందడి..
ఆకేరు న్యూస్, రాయపర్తి: భిన్నత్వంలో ఏకత్వం.. భారతీయ సంస్కృతిలోని గొప్పదనాన్ని చాటుతూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరులోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (Ek Bharat Shreshtha Bharat) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హర్యానా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేలా ఫుడ్ ఫెస్టివల్ (Food Festival), సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వి.వి.ఆర్. ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు హర్యానా సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హర్యానా జానపద గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, అభినయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు వి.వి.ఆర్. ఆచార్య మాట్లాడుతూ.. భారతదేశంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరం ఒక్కటేననే భావనను విద్యార్థుల్లో పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలోని విద్యార్థులకు మరో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం ద్వారా చిన్నతనం నుంచే జాతీయ సమగ్రత, ఐక్యతా భావం పెంపొందుతాయని వివరించారు.
సీనియర్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రాంతీయ భేదాలు, విభేదాలను పక్కనపెట్టి మనమంతా భారతీయులమనే సోదరభావాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇతరుల ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆలోచనలను గౌరవించే మంచి లక్షణాలను పెంపొందించుకోవాలని హితవు పలికారు.
కార్యక్రమ సమన్వయకర్త అనితా రాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు హర్యానా రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ నృత్యాలు, ప్రత్యేక వంటకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యాంసుందర్, నాగరాజు, అమరస్వర్ణ, స్వామి, శివకృష్ణ, వీరస్వామి, నరేష్, రమ, స్వరూప, రసజ్ఞ తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

