* గతంతో పోల్చుకుంటే తగ్గుతున్న పోలింగ్
* రాజధాని హైదరాబాద్‌లో మరీ ఘోరం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని రాజకీయ పార్టీల వినతులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. మే 13న పోలింగ్‌లో పాల్గొనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.పోలింగ్ సమయాన్ని పెంచింది. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని పేర్కొంది. షెడ్యూల్ ప్రకటన సమయంలో ఈసీ.. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకే ఓటింగ్ కు సమయం ఇచ్చింది. ఎండల నేపథ్యంలో సాయంత్రం సమయం పెంచాలని ఆయా పార్టీలు ఈసీకి లేఖలు రాశాయి. ఈమేరకు ఈసీ తాజాగా స్పందించింది.
మండుతున్న ఎండల నేపథ్యంలో
ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరుగుతుండగా.. తెలుగు రాష్ట్రాల్లో 4 వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13 వ తేదీన జరగనున్న తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. ప్రస్తుతం ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతుండగా.. మే నెల మధ్య నాటికి ఇవి మరింత పెరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, 46 డిగ్రీలు దాటిపోయింది. ఠారెత్తిస్తున్న ఎండల నేపథ్యంలో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు రావడానికి ఆసక్తి చూపరని, ఓటింగ్ శాతం తగ్గుతుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం.. పోలింగ్ సమయం పెంపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లలో నిలుచున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేయడానికి అవకాశం కలుగుతుంది.దీని ప్రకారం పోలింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 7 గంటలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
సద్వినియోగం చేసుకుంటారా?
పెంచిన పోలింగ్ సమయాన్ని ప్రజలు వినియోగించుకుంటారా? సమయాన్ని పెంచాలని కోరిన పార్టీలు పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికలతో పోలిస్తే.. 2019 ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. వివిధ పార్లమెంటరీ స్థానాల్లో దాదాపు 5 నుంచి 16 శాతం మేర పోలింగ్ శాతం తక్కువగా నమోదవడం విస్మయం కలిగించింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 62.25 శాతం పోలింగ్ నమోదు కాగా, అంతకు ముందు ఎన్నికల్లో 70.75 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోనే అత్యల్పంగా 39.49 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. మల్కాజిగిరి సెగ్మెంట్ లో 42.75.. సికింద్రాబాద్ సెగ్మెంట్ లో 45 శాతం ఓటింగ్ నమోదైంది. 17 లోక్‌సభ స్థానాలకు గాను హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగరం పరిధిలో ఉన్నాయి. మిగతా 14 స్థానాల్లో 50 శాతానికి మించి పోలింగ్ నమోదైతే.. నగరంలోని ఈ మూడు నియోజకవర్గంలో 50 శాతం లోపు మాత్రమే ఓట్లు పోల్ కావడం గమనార్హం. ఈక్రమంలో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా పోలింగ్ సమయాన్ని కూడా పెంచారు. పోలింగ్ శాతం పెరుగుతుందా.? లేదా అనేది చూడాలి.
—————————–