
* రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి..
* బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి
ఆకేరు న్యూస్, ములుగు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు.తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఉన్న కరెంటు సబ్ స్టేషన్ రైతులతో కలిసి సందర్శించి కరెంటు సమస్యల మీద అక్కడి అధికారులతో ఆమె మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మేడారం చుట్టుపక్కల గ్రామాలకు త్రి ఫేస్ కరెంటు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, గత కొన్ని రోజుల నుండి కరెంటు సక్రమంగా రావడం లేదని, అరకోరుగా వర్షాలు పడుతున్నాయని పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారని, రాత్రి సమయాల్లో కరెంటు ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులతో మాట్లాడిన కూడా మాపైన ఉన్న అధికారులు చెప్తున్న ప్రకారం కరెంటు ఇస్తున్నామని సబ్ స్టేషన్ లో ఉన్న అధికారులు తెలిపారని ఆమె పేర్కొన్నారు .
కాంగ్రెస్ అంటేనే కష్టాలు…
కష్టాలు అంటేనే కాంగ్రెస్ అని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో కాలిపోయే మోటర్లు పేలు పోయే ట్రాన్స్ఫార్మర్లు తప్ప 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఆమె ఆరోపించారు. పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ ఇచ్చి రైతులను రారాజు చేస్తే, 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 గంటలలోపే రైతులకు కరెంటు ఇచ్చి రైతులను ఇబ్బంది చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్న కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదన్నారు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం తో ప్రభుత్వాలు నిలబడిన దాఖలాలు లేవని ఆమె అన్నారు.
మూడు సంవత్సరాలు గడిస్తే మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మళ్లీ రైతు రారాజు అవుతాడని ఆమె అన్నారు. రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే రైతులతో కలిసి ములుగు జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల అధ్యక్షుడు దండగుల మల్లయ్య, జిల్లా నాయకులు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, దుర్గం రమణయ్య, కోట సురేష్ గౌడ్, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………