* వ్యసనాలకు బానిసలై అడ్డదారులు
* సంపాదన కోసం గంజాయి, డ్రగ్స్ రవాణా
* విజ్ఞానంతో పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తలు
* హైదరాబాద్‌లో తరచూ వెలుగులోకి ఘటనలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
మంచి చదువులు చదువుతున్నారు. వాటిని పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరితే లక్షణంగా నెలకు రూ.లక్ష జీతం ఇచ్చే కంపెనీల్లో చేరొచ్చు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా విలాసవంతమైన జీవితం గడపొచ్చు. కానీ, చదువుకునే క్రమంలో విలాసాలకు అలవాటై, చెడు స్నేహాలు పట్టి కొందరు పక్కదారులు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. తర్వాత వాటి కొనుగోలుకు, జల్సాలకు డబ్బు కోసం వాటినే ఉపాధి మార్గాలుగా ఎంచుకుంటున్నారు. స్మగ్లర్ల అవతారం ఎత్తి.. మరి కొంత మంది యువతను ఉచ్చులోకి లాగుతున్నారు. చదువు వల్ల కలిగిన విజ్ఞానాన్ని పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వినియోగిస్తున్నారు.
శివరాం (28) ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. డబ్బు సంపాదన కోసం మత్తు పదార్థాల విక్రయాలు ప్రారంభించాడు. హైదరాబాద్‌లో గంజాయిగా పిలువబడే ‘హై-క్వాలిటీ’ OG కుష్‌ను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్ బస్టాప్‌లో గంజాయి అమ్ముతున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. చెడు అలవాట్ల కారణంగా ఖర్చులు భరించలేక నిందితుడు భరత్ రమేష్ బాబు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి దిగాడు. ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) అధికారులు ఈ ఆపరేషన్ సమయంలో అతని నుండి 1.1 కిలోగ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ రూ.1.40 కోట్లు
విదేశాల నుంచి హైడ్రోపోనిక్ గాంజా(ఓజీ)ను దిగుమతి చేసుకొని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను హెచ్ న్యూ (హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్), నల్లకుంట పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,380 గ్రాముల ఓజీ గాంజా, 44 ఎల్ఎస్డీ బ్లాట్స్, 250 గ్రాముల మ్యాజిక్ మష్రుమ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.40కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు బీటెక్ చదివినట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్ జబల్పూర్కు చెందిన ప్రధాన స్మగ్లర్ హర్షవర్థన్ శ్రీవాత్సవ అలియాస్ హర్ష పుణెలో బీటెక్ ఆర్కిటెక్చర్ చదివాడు. అక్కడ స్నేహితులతో కలిసి మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. ఇంటర్న్‌షిప్‌లో ఉండగానే లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనే ఉద్ధేశ్యంతో డ్రగ్స్ స్మగ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు.
టెక్నాలజీపై పట్టుతో
తమకు టెక్నాలజీపై ఉన్న పట్టును పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు వినియోగించారు. ఎక్కడా తాను సీన్లో ఉండకుండా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని దందా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. సిగ్నల్ యాప్ ద్వారా డార్క్‌నెట్‌లో డ్రీడ్ మార్కెట్ ప్లాట్ఫామ్లో ఓజీని ఆర్డర్ చేసేవారు. నిర్వాహకులు సరుకును డీటీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్ సర్వీస్‌ల ద్వారా పంపేవారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు హర్ష తప్పుడు అడ్రస్‌లు ఇచ్చేవాడు. సరుకు డెలివరీ సమయంలో అడ్రస్ దొరక్కపోవడంతో కొరియర్ సిబ్బంది ఫోన్ చేస్తే కార్యాలయానికి వెళ్లి పార్శిల్‌ను తీసుకునేవారు. వాటిని వినియోగదారులకు సరఫరా చేసేవాడు.
సిగ్నల్, స్నాప్‌చాట్ ద్వారా నెట్వర్క్ హర్షవర్థన్‌ను చెన్నైకి చెందిన శ్రీనివాస రాహుల్ అలియాస్ రాహుల్‌తో పరిచయం ఏర్పడింది.
మరొకరూ బీటెక్ విద్యార్థే..
2016లో బీటెక్ పూర్తి చేసిన రాహుల్ ఇంజరింగ్ చదిదేటప్పుడే డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. ఆ తర్వాత దాన్నే ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు. పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు. తమ నెట్‌వర్క్‌లో పనిచేయడానికి హర్షవర్దన్, రాహుల్ హైదరాబాద్‌లో అభిషేక్, ధావల్ అనే ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన అభిషేక్ ఐఐటీ రాయ్‌పూర్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ధావల్తో కలిసి రాహుల్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఓజీని కస్టమర్స్‌కు సరఫరా చేసేవారు. సరుకు అవసరమైనప్పుడు సిగ్నల్ యాప్ ద్వారా రాహుల్‌ను సంప్రదించి ఓజీ, మ్యాజిక్ మష్రూమ్స్‌ను అభిషేక్ ఆర్డర్ చేసేవాడు. ఇలా ఆన్లైన్ నెట్‌వర్క్‌ల ద్వారా హర్ష తన నెట్‌వర్క్‌ను విస్తరించుకుని డ్రగ్స్ దందాను కొనసాగించేవాడని పోలీసులు తెలిపారు.
వ్యసనంగా మారి.. ఉపాధిగా ఎంచుకుని..
పోలీసులకు పట్టుబడుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, బీటెక్ విద్యార్థులు అందరూ తొలుత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. వ్యసనపరులుగా మారుతున్నారు. ఈక్రమంలో లగ్జరీ జీవితానికి అలవాటు పడుతున్నారు. జల్సాల కోసం డబ్బు సంపాదించాలని డగ్ర్స్ అమ్మకాలనే ఉపాధిగా మార్చుకుంటున్నారు. ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ శ్రీహర్ష బ్యాంకు ఖాతాలను గుర్తించిన పోలీసులు రోజుకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షల వరకు డబ్బులు ఖాతాలో పడుతున్నట్లు గుర్తించారు. ఈ లెక్కన ఏ స్థాయిలో డ్రగ్స్ దందాను నిర్వహిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. హర్ష నెట్‌వర్క్‌లో ఓజీ, మ్యాజిక్ మష్రూమ్స్, ఎల్ఎస్డీ బ్లాట్స్ డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో సింహభాగం సంపన్నుల పిల్లలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్స్, ఇంజనీర్స్ వంటి హై ప్రొపైల్ రంగాల్లో బాగా స్థిరపడి రూ. కోట్లకు పడగలెత్తిన వారి పిల్లలే ఈ డ్రగ్స్ ముఠాలో వినియోగదారులుగా ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.
……………………………………………….
