ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు తో రాజకీయ ప్రకంపనలు
- ఎర్రబెల్లి వల్లనే జైలుకు వెళ్ళానన్న రేవంత్ రెడ్డి
- దయాకర్ రావు జైలుకు పంపిచడమే లక్ష్యం అన్న ప్రచారం
- రక్షణ కోసం ఎర్రబెల్లి బీజేపీలోచేరుతున్నాడన్న ప్రచారం
- పార్టీ మార్పు తప్పుడు ప్రచారమన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.
( చిలుముల్ల సుధాకర్ )
ఆకేరు న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. వార్ రూమ్‌లు ఏర్పాటు, విపక్ష నేతల లక్ష్యంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం.. ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రణీత్ రావు కార్యకలాపాలు ఉండడం.. ప్రభుత్వం మారడంతో ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేయడం మాజీ డీస్పీ ప్రణీత్ రావు మీద ప్రధాన ఆరోపణలు.. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇపుడు బీఆర్ ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా బీఆర్ ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్యంగా మరింత పకడ్భందీగా కేసు కదులుతున్నట్టు బీఆర్ ఎస్ నేతలు భయాందోళనలకు లోనవుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరందుకుంది. రక్షణ కోసం బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. విషయం తెలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగానేను పార్టీ మారడం లేదు.. బీఆర్ ఎస్ పార్టీలోనే కొనసాగుతాను.. నాపై కాంగ్రెస్ పార్టీ నాయకులే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
. అని మంగళవారం మీడియాకు స్పష్టం చేశారు. అంతేకాకుండా అసలు ఈ డీఎస్ఫీ ప్రణీత్ ఎవరో నాకు తెలియదన్నారు. ఎర్రబెల్లి వివరణ వల్ల ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి పెద్దగా బ్రేక్ పడే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఇటీవలి కాలంలో ఏ నాయకుడు ఏ పార్టీలోకి ఎప్పుడు మారుతాడో చెప్పలేని రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఉదయం పార్టీ మారడం లేదని ఘంటాపధంగా చెప్పి ..సాయంత్రం వరకే పార్టీ మారిన నాయకులు ఎంతో మంది ఉన్నారన్న చర్చ ప్రజల్లో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే ఫ్యోన్ ట్యాపింగ్ లాంటి అంశాలకు సంబందించిన కేసులు, దోషులు ఆనాటి ప్రభుత్వ పెద్దలు బాధ్యులు కావాలి. కేబినెట్లో ఒక మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు చుట్టే ఎందుకు తిరుగుతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది. - ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ..
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబందించి ఎర్రబెల్లి దయాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు దుగ్యాల ప్రణీత్‌రావు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన వాడు. అతని అమ్మగారి ఊరు పర్వతగిరి. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో దయాకర్ రావుకు బంధుత్వం ఉందన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని తిప్పకొడుతూ అసలు ప్రణీత్ రావు ఎవర్ కూడా తనకు తెలియదని దయాకర్ రావు ఖండించారు. దయాకర్ రావు కోసం ప్రణీత్ రావు నియోజకవర్గంలోని రాజకీయ ప్రత్యర్థుల కదలికల మీద నిఘా వేశారన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ను నేరుగా పోలీసులు ప్రస్తావించక పోయినప్పటికీ పర్వతగిరిలో వార్ రూమ్‌ల ఏర్పాటు లాంటి అనేక అంశాలు దయాకర్ రావునే సూచిస్తున్నాయి.
ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు మద్య వైరుధ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచే కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మద్య ఉప్పు- నిప్పు చందంగా నే ఉండేదని అప్పటి తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కొనసాగుతూ అప్పటి సీయం క్యాంపుకార్యాలయానికి దయాకర్ రావు వెళ్ళిన ఫోటోలు పత్రికల్లో వచ్చాయి. ఇదీ రేవంత్ రెడ్డి తనను ఇబ్బంది పెట్టడానికే చేసిన పనేనని తన ఆత్మీయులతో ఎర్రబెల్లి అనేవారట.. ఇక తాను జైలుకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్ రావేనని స్వయంగా రేవంత్‌రెడ్డి పాలకుర్తి బహిరంగ సభలో అన్నారు. శత్రువులతో చేతులు కలిపి ఎర్రబెల్లి మోసం చేశాడని అన్నారు. దీనికి ముందు కూడా అనేక సంధర్భాల్లో ఇద్దరి మద్య తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. తను జైలుకు వెళ్ళడానికి కారణమైన ఎర్రబెల్లి దయాకర్ రావును సైతం జైలు కు పంపించే లక్ష్యంతో పావులు కదులుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ప్రణీత్ రావు ప్రథాన కార్యాచరణ ఉండేదంటున్నారు. రేవంత్ రెడ్డికి ఎవరు సహకరిస్తున్నారు. ఆర్థికంగా చేయూతనందించేది ఎవరూ అన్న సమాచారం ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారిని కట్టడి చేసేవారంటున్నారు. ఇందుకోసం మీడియా వర్గాల సహకారం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి లక్ష్యంగా ట్యాపింగ్ చేయడం .. అదీ కూడా చట్ట విరుద్దంగా కొద్దిమంది నాయకుల కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం ట్యాపింగ్కేసులో మరింత తీవ్రత పెరుగుతోంది. - ప్రణీత్ రావు ట్యాపింగ్ ప్రభుత్వం నేతల కోసమేనటా..!
- ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం చట్టరీత్యా నేరంగా పరిగణింపబడుతుందని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దేశ రక్షణ వ్యవహారాల్లో బాగంగా దేశద్రోహానికి పాల్పడుతున్నట్టుగా అనుమానిస్తున్న వారిపై పోలీస్, నిఘా సంస్థలు అన్ని రకాలుగా నిఘా ఉంచుతాయి. వారి కదలికలను, కార్యకలాపాలను కనిపెట్టేందుకు మాత్రమే ఫోన్ కాల్స్ రికార్డ్స్ చేస్తుంటారంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిఘా సంస్థే ఎస్ఐబీ ( స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచి ) . ఈసంస్థ మానిటరింగ్ కూడా ఉన్నతాధికారులనుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విభాగం పనితీరు వల్లనే రాష్ట్రంలో మావోయిస్ట్‌ల కార్యకలాపాలను నియంత్రించగలిగారు. ఇందులో భాగంగా పనిచేయాల్సిన ప్రణీత్ రావు మాత్రం ఎంపిక చేసిన కొద్దిమంది నాయకుల కోసమే విధినిర్వహణలు చేపట్టినట్టు పోలీస్ విచారణలో వెల్లడవుతోంది. పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం నెరవేర్చుకునేందుకు వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త సంధ్య కన్వన్షన్ మేనేజిగ్ డైరెక్టర్ శ్రీధర్ రావు పంజాగుట్ట పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్లతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలో స్పెషల్ రూం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించడమే కాకుండా జిల్లాల్లో అనుబంధంగా ప్రత్యేక వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారని విచారణలో తెలుస్తోంది. ఈ పనులన్నీ కూడా ప్రత్యేకంగా ప్రభుత్వ మనుగడ కోసం కాకుండా కొద్ది మంది నాయకుల ప్రయోజనం కోసమే అని తెలుస్తోంది. ఇందుకు నజరానా గానే ప్రణీత్ రావుకు యాక్జిలరీ ప్రమోషన్ రావడం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాణాలకు తెగించి నక్సలైట్లను, టెర్రరిస్ట్‌లను అణచివేసిన అధికారులకు మాత్రమే ఈ యాగ్జిలరీ ప్రమోషన్లు ఇస్తారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అలాంటి కార్యకలాపాలు ఏవి లేకుండానే ప్రణీత్ రావుకు డీఎస్పీగా ప్రమోషన్ రావడం రాజకీయ పెద్దల సేవలో తరించడమే కారణమంటున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా వ్యక్తిగతంగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఇలాంటి కార్యకలాపాలు చేసే అవకాశం ఉండదంటున్నారు. ఈ కోణంలోనే అప్పటి ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పాత్రను తెలుసుకునే కోణంలోనే విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
- ———