
* విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై భిన్న కథనాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ హీరో విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన రోడ్‌షో తీవ్ర విషాదం నింపింది. దాదాపు 39 మంది ప్రాణాలను బలిగొంది. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై రాజకీయ, అధికార వర్గాల కథనాలు వేర్వేరుగా ఉన్నాయి. పోలీసులు సరైన భద్రత కల్పించలేదని, వారి నిర్లక్ష్యమే ఇంతటి విపత్తుకు కారణమని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు సవివరణ ఇచ్చారు. తమిళనాడు డీజీపీ జి. వెంకటరామన్ (Dgp Venkataraman)ఈ ఘటనపై స్పందించారు. కరూర్ సభకు పది వేల మంది వస్తారని నిర్వాహకులు ఊహించారని, కానీ దాదాపు 27,000 మంది వచ్చారని, ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని నియమించామని డీజీపీ అన్నారు విజయ్ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అనుమతి కోరారని, అయితే టీవీకే ట్విటర్ ఖాతాలో మాత్రం విజయ్ (Vijay)12 గంటలకే వస్తారని పేర్కొన్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి జనం రావడం ప్రారంభించారని, విజయ్ చివరకు సాయంత్రం 7.40 గంటలకు వచ్చారని తెలిపారు. అంతసేపు ఎండలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు లేదని తెలిపారు. జన సమూహాన్ని పెంచడం కోసమే విజయ్ సభకు అంత ఆలస్యంగా వచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) ఈ ఘటనపై సమగ్ర దర్యాఫ్తునకు ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఘటనపై పూర్తి నివేదికను అందించబోతోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా ఇంతటి మహా విషాదానికి అధికార, రాజకీయ వర్గాలు కూడా కారణమనే పలువురు విమర్శిస్తున్నారు.
విజయ్ సహాయకులపై కేసు
కరూర్ సభలో తొక్కిసలాటకు సంబంధించి విజయ్ సహాయకులు ఇద్దరిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పై పోలీసులు
ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎస్ డేవిడ్ సన్ తెలిపారు.
కేంద్రప్రభుత్వం ఆరా
తమిళనాడులోని కరూర్ లో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
20 లక్షల పరిహారం ప్రకటించిన విజయ్
కరూర్ తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు హీరో విజయ్ 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి 2 లక్షల చొప్పున ప్రకటించారు. కాగా కరూర్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొనడానికి వచ్చిన జనాల్లో 39 మంది మరణించడం 100మందికి పైగా గాయాలపాలు కావడంతో తాను భరించలేని బాధలో ఉన్నానని,నా హృదయం ముక్కలైందని హీరో విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటను గురించి తనకు మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
……………………………….