
* రేపో మాపో ఓటర్ల జాబితా..
* నాలుగైదు రోజుల్లో షెడ్యూల్
* పంచాయతీ ఎన్నికలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు. మరోవైపు ఓటు వేయాలనుకునే ప్రజలు, ఇంకోవైపు గెలిచి తీరాలనే పట్టుదలలో పార్టీలు.. ఇలా ఆయా స్థాయిల్లో ఎదురుచూపులు మొదలయ్యాయి. ఎన్నికలను నిర్వహించాల్సిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పథకాల అమలుకు కోడ్ అడ్డంకులు కూడా లేవు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం వెలువడగానే షెడ్యూలు విడుదల చేసి పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కసరత్తు మొదలుపెట్టింది. నాలుగైదు రోజుల్లో ఈ విషయంలో ఒక నిర్ణయం వెలువడుతుందని తెలుస్తున్నది. ఈలోపే రెండు మూడు రోజుల్లో ఓటర్ల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి సమాచారం అందగానే షెడ్యూల్ ప్రకటించడానికి వీలుగా కమిషన్ స్టాఫ్ సిద్ధమవుతున్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, భవనాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది కి సమకూర్చాల్సిన సామాగ్రి, బ్యాలట్ పేపర్ల ముద్రణ, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ బాక్సు లను రెడీ చేసుకోవడం.. ఇలాంటి ఏర్పాట్లన్నీ దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు కమిషన్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
వార్డులవారీ జాబితాలు రెడీ
కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండి ఓటర్లుగా నమోదైన వివరాలన్నింటినీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం ఇప్పటికే తుది జాబితా రూపంలో విడుదల చేసింది. వాటి ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వార్డులవారీ ఓటర్ల జాబితాను రెడీ చేసుకున్నది. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే సిబ్బందిని పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా వివిధ డిపార్టుమెంట్ల నుంచి సమకూర్చుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంది. అవసరమైన ట్రెయినింగ్ ప్రక్రియను కూడా వీలైనంత తొందరగానే పూర్తి చేయవచ్చనే ధీమాను ఆ వర్గాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం నుంచి సమాచారం అందగానే షెడ్యూలు విడుదల మొదలు కౌంటింగ్ వరకు మొత్తం ప్రక్రియను మూడు వారాల్లో పూర్తి చేయగలమన్న అంశాన్ని ఆ వర్గాలు నొక్కిచెప్పాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓటర్ల జాబితా ప్రక్రియను గతేడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనే అప్పటి వివరాల ఆధారంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పూర్తయింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పంచాయతీలకు వార్డులవారీగా కూర్పు ప్రక్రియ పూర్తయింది. కానీ అప్పట్లో వివాదంలో ఉన్న 11 జిల్లాల్లో ని 64 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా విడుదల ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ డిపార్టుమెంటు డైరెక్టర్ ఆదేశాల మేరకు వాటి జాబితాలను కూడా ఈ ఏడాది జనవరి 1వ తేదీన ప్రామాణికంగా తీసుకుని సిద్దం చేయాలని స్టేట్ ఎల క్షన్ కమిషన్ ఆ జిల్లాల పంచాయతీరాజ్ అధి కారులను తాజాగా ఆదేశించింది. ఫోటోలతో కూడిన వార్డులవారీ ఓటర్ల జాబితాలు నేడు రెడీ కానున్నాయి.
…………………………….