* అరటి పండ్లే జీవనాధారం
* ఆత్మ విశ్వాసంతో ముందడుగు
* పిల్లలను చదివిస్తూ ఉన్నంతలో తృప్తి పొందుతూ..
ఆకేరు న్యూస్,హనుమకొండ : ఎంత ఉన్నా, ఏది ఉన్నప్పటికీ ఏదో వెలితి, మరింకేదో కావాలనే ఆతృత…స్వల్ప విషయాలకే ఆత్మ న్యూనతా భావంతో కుంగి పోతారు… ఇందుకుభిన్నంగా మరి కొద్ది మంది మాత్రం అవకాశాల కోసం ఆకాశం వంక చూడరు..అందినదానినే అవకాశం గా మలుచుకుంటారు.. అలాంటి కోవలోకి వస్తాడు ముచ్చు చంద్రమౌళి .. అతని జీవితం ఎంతో స్పూర్తి దాయకం ..ఆయన జీవన ప్రస్థానం ఆయన మాటల్లోనే…
జీవితంలో పాస్ ..
పదవతరగతి ఫెయిల్ అయ్యాను ..అయితేనేం జీవితంలో పాసయ్యాను ..నేను పూర్వ పు కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేటలో జన్మించాను. నా పేరు ముచ్చు చంద్రమౌళి. పదవ తరగతి ఫెయిల్ అయ్యాను. ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్మతో కలిసి పనులకు వెళ్లాను. దీంతో చదువుకోలేకపోయాను. పట్టణానికి తొలత నా బావమరిది వచ్చాడు. అతడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. 25ఏళ్ల నుంచి అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నాను. సొంత ఇల్లులేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నాను. పిల్లల విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. పిల్లలు ఉన్నత చదువులు చదవాలని నా కోరిక వారి కోసం ఎంతైనా కష్టపడతాను. జీవితంలో పిల్లలు ఉన్నతంగా స్థిరపడాలననదే నా ఆశయం. పాప ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో పూర్తి చేసింది. బాబు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.
ఉదయం 7 గంటలకు రోడ్డెక్కాల్సిందే…
ఉదయం 5.30 గంటల వరకు నిద్రలేస్తాను. ఇంట్లో పనులు ముగించుకొని పండ్ల వ్యాపారానికి బయలుదేరుతాను. ఉదయం 7 నుంచి 7.30 గంటల ప్రాంతంలో ప్రారంభించి రాత్రి 10.30 నుంచి 11 గంటల వరకు రోడ్లపై తిరుగుతూ అరటి పండ్లను అమ్ముతాను. రోజుకు నాలుగు నుంచి ఆరు బాక్సుల అరటి పండ్లు అమ్ముతాను. ఒక్కో బాక్సులో సైజును బట్టి ఏడు డజన్ల నుంచి తొమ్మిది డజన్ల అరటి పండ్లు ఉంటాయి. పెట్టుబడి వ్యవహారమని వేరే ఏ పని చేయడంలేదు. ప్రస్తుతం హైబ్రిడ్ అరటి పండ్లే వస్తున్నాయి. మన దగ్గరకు నాందేడు ప్రాంతానికి చెందిన పండ్లు ఎక్కువగా వస్తాయి. వీటిని ఏసీ గదులలో నాలుగు రోజులు ఆ గదిలోనే ఉంచుతారు. అనంతరం అమ్మకానికి బయటకు తీసుకొస్తారు.. నేను స్థానిక బస్స్టాండ్ ప్రాంతంలోని గోడౌన్ నుంచి తెచ్చి అమ్ముతాను. నెల మొత్తం అమ్మితే రూ.15 నుంచి రూ.20 వేల వరకు వస్తాయి. ఇంటి కిరాయి రూ.3వేలు పోతాయి. నాతోపాటు నా భార్య కూడా ఇదే వ్యాపారాన్ని సాయంత్రం వరకు చేస్తుంది. మేము సంపాదించింది పిల్లల చదువులకు, వారి బాగోగులకే సరిపోతుంది. ప్రస్తుతం జీవితం సాఫీగానే సాగుతోంది.
…………………………………………

So inspiring story 👏
Keep going strong 💪
I wish your family will be more successful in future!