
* ఎక్సైజ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు
* 840 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం
* ఇద్దరి అరెస్టు.. పరారీలొ మరొకరు
ఆకేరు న్యూస్, సూర్యపేట : జిల్లాలో కొందరు వ్యక్తుల నకిలీ మద్యం తయారు చేయడం గుట్టు రట్టయింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రామాపురం గ్రామంలోని ఓ షెడ్డులో కొందరు వ్యక్తులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా సోమవారం దాడులు నిర్వహించారు. రూ.20 లక్షల విలువైన 840 లీటర్ల నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రామాపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతడు గతంలో మేళ్లచెర్వు మండలంలోని ఓ వైన్స్ దుకాణంలో గతంలో గుమస్తాగా పనిచేశారు. శివశంకర్ తన స్నేహితులైన రామాపురం గ్రామానికి చెందిన సూర్యప్రకాశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దుర్గికి చెందిన శ్రీరాం మహేశ్‌తో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని తయారుచేసేందుకు ఈ ముఠా సన్నద్ధమైంది. స్థానికులు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నకిలీ మద్యాన్ని ఖాళీ సీసాల్లో నింపి మూతలు బిగించి నకిలీ లేబుల్స్ అతికించి విక్రయించే యత్నం చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రతి ఖాళీ విస్కీ సీసాలో 1/4 శాతం స్పిరిట్, 3/4 శాతం నీరు, ఇతరాలు కలిపి విస్కీలా తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి స్పిరిట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. నకిలీ మద్యం తయారు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ పోలీసులు సూర్యప్రకాశ్, శ్రీరాం మహేశ్‌ను అరెస్టు చేయగా, శివశంకర్ పరారీలో ఉన్నాడు.
………………………………………………