* కర్రలు, రాడ్లతో అటాక్
* ఆస్పత్రిలో భార్యాభర్తలు
* కుక్కనూ విచక్షణారహితంగా కొట్టారు..
* నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు
ఆకేరు న్యూస్, హైదరబాద్ : పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తలపై కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుక్కనూ విచక్షణారహితంగా కొట్టారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. రెహ్మత్‌నగర్‌లో నివాసం ఉండే ఎస్. శ్రీనాథ్, అతడి భార్య స్వప్న ఈ నెల 8న ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి ఇంటి నుంచి పెంపుడు కుక్కతో బయలుదేరారు. అదే సమయంలో ఇంటి పక్కనుండే ధనుంజయ్ తన కుక్కతో రోడ్డుపై ఉన్నాడు. ఆ సమయంలో శ్రీనాథ్ కుక్క ధనుంజయ్ ను చూసి మొరిగింది. దీంతో శ్రీనాథ్, స్వప్నలను ధనుంజయ్ దుర్భాషలాడాడు. దీనిపై శ్రీనాథ్ దంపతులు ధనుంజయ్ పై మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ధనుంజయ్ అప్పటి నుంచీ కోపం పెంచుకున్నాడు. తిరిగి ఈ నెల 14 సాయంత్రం కుక్కతో శ్రీనాథ్ బయటకు రాగా, ధనుంజయ్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో శ్రీనాథ్, అతడి భార్యపై దాడి చేశారు. కుక్కను కూడా విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కకు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కుక్కను కావాలనే తమపై ఉసిగొల్పారంటూ ధనుంజయ్ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఈ గొడవపై రెండు కుటుంబాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
——————-